ఎందుకీ పుస్తకం?

నేను విద్యార్థిగా వున్నప్పుడు చాలామంది టీచర్లు నన్ను ప్రభావితం చేశారు. వారి ప్రభావం ఇంకా నా మీద ఉన్నది. నేను అధ్యాపక వృత్తిని చేపట్టిన తర్వాత విద్యార్థులను ఏ విధంగా ఉత్తేజ పరిచే పద్ధతులను, వారు అనుకున్నలక్ష్యాలను సాధించడానికి కావలసిన స్ఫూర్తిని రగిలించే పద్ధతులను నేర్చుకున్నాను. విద్యార్థులను కార్యోన్ముఖుల్ని చెయ్యడానికి ముందుగా నేను స్ఫూర్తిని పొందే అంశాలను స్పష్టంగా అర్థం చేసుకోవడం, విద్యార్థులకు చెప్పాల్సిన పాఠ్యాంశాలను ఎఫెక్టివ్‌గా చెప్పగలిగే నైపుణ్యాలను సాధన చెయ్యడం ప్రారంభించాను. పాఠాన్ని పిల్లలకు బోధించే ముందు ఎలాంటి ఎత్తుగడను వెయ్యాలో మా టీచర్‌ సి.రామయ్య సార్‌ దగ్గర నేర్చుకున్నాను. అంశాన్ని ఎంత లోతుగా, రకరకాల పద్ధతుల్లో చెయ్యగల నేర్పు తెచ్చుకోవలసిన అవసరాన్ని నా మిత్రుడు, గణిత లెక్చరర్‌ డా|| విద్యా మనోహరశర్మను చూసి ప్రయత్నం చేసేవాణ్ణి. టీచర్‌ ట్రైనింగ్‌ ఇవ్వడం మొదలు పెట్టినప్పటి నుండి కొన్ని వేలమంది టీచర్లను కలిసే అవకాశం కలిగి, వాల్ళ అనుభవాలు తెలుసుకుని మరింత లోతుగా విద్యార్థుల సైకాలజిని అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. ఆ అనుభవంతో నేనిచ్చిన టీచర్‌ ట్రైనింగ్‌కు మంచి ఆదరణ లభించింది.

ఇలా నేర్చుకున్న అంశాలను మన దేశంలో వున్న అధ్యాపకులకు చేర్చాలన్న తపన, నన్ను ఈ వ్యాసాలు రాసేటట్టు చేసింది. ఈ పుస్తకంలో చెప్పినవన్నీ నేను పాటించినవి. ఎఫెక్టివ్‌ టీచర్స్‌ పాటించినవి, ప్రపంచవ్యాప్తంగా ఆచరణలో ఉన్న కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి, సమాజాన్ని ప్రభావితం చెయ్యగలిగే 'ప్రభ' ఒక టీచర్‌కు మాత్రమే ఉందన్న దాన్ని నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఈ ప్రపంచాన్ని మరింత ఉన్నతంగా మార్చడానికి మారుతున్న కాలానికి అనుగుణంగా తమనుతాము మరింతగా సానబెట్టుకోవడానికి ఇది అధ్యాపకులకు ఆకురాయిలా ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాను. ఇందులోని వ్యాసాలన్నీ ''సైకాలజీ టుడే'' మాగ్యజైన్‌లో 2 సంవత్సరాలుగా ధారావాహికగా వచ్చాయి. 

ఈ పుస్తకాన్ని పదేపదే చదవడం వల్ల మాత్రమే మన నైపుణ్యాలు మెరుగుపడడానికి అవకాశం వుంటుంది. ఇందులోని అంశాలు, వేటికవే ఇండిపెండెంట్‌ లక్షణాలు కలిగినవి. కావున మీరు ఏ పేజీ ఎప్పుడు చదివినా మీకు లాభం కలుగుతుంది. దీనిని నవలలా కాకుండా ఒక సాధనలాగా, సైకిల్‌ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎలాగైతే తొక్కగలిగే వరకు సాధన చేస్తామో అలాగే ప్రతి ఒక్క అంశాన్ని నేర్చుకొని ఆచరణలో పెట్టేవరకు సాధనచేస్తే మీరు రాబోయే తరాలను ప్రభావితం చెయ్యగలిగే అధ్యాపకుడిగా అవతరిస్తారు. అప్పుడు విద్యార్థిలోకం మిమ్మల్ని అనుసరిస్తుంది. తల్లిదండ్రులు సంతోషంతో మీకు జేజేలు పలుకుతారు. సమాజం కొత్త కాంతితో శక్తిమంతమౌతుంది.

మీ

డా|| సి.వీరేందర్‌

పేజీలు : 155

Write a review

Note: HTML is not translated!
Bad           Good