రోజువారీ జీవితంలోని సమస్యల పరిష్కారం కోసమో, జ్ఞాన సముపార్జన కోసమో, నిరంతరం పేరుకుపోయే విసుగుని బద్దలు కొట్టడం కోసమో సాహిత్యాన్ని ఆశ్రయించే పాఠకులకు తనదైన తత్వదర్శనం చేయించి విశ్వతత్వాన్ని అర్ధం చేయిస్తూ సమాజ స్వభావాన్ని అవగాహన చేసుకోవడానికి అవకాశం ఇస్తూ స్వీయ పరిణామానికి కావలసిన మార్గాన్ని సుగమం చేయడమే సాహిత్య ప్రధాన ప్రయోజనం.

మన బలహీనతలను రెచ్చగొడుతూ, భ్రమలలో జోకొడుతూ, భద్రతా రాహిత్యాల విముక్తి కోసం అవిటి ట్రిక్కులనీ, నిర్జీవమైన మార్గాంతరాలనీ అందించే సాహిత్యంలో పుస్తకాల సంత విలవిలలాడుతుంది. ఈ విషాద సందర్భాన మానవ తత్వాన్నీ, విశ్వతత్వాన్నీ సరళంగా, సహజంగా అర్ధం చేయిస్తూ, వాటి మధ్య ఉన్న అనుసంధానతని విపులంగా విశదీకరిస్తూ తెలుగు సాహిత్య రంగంలోకి 'పరుసవేది' ప్రవేశించడం ముదావహం.

తర్కాలకీ, హేతుబద్దతకీ, ఇంద్రియాల గ్రహింపుకీ కుదరని-అందని, నిశిత నిగూఢ స్ధాయిలో అసలైన మౌలిక ప్రజ్ఞలన్నీ గుప్త నిర్మాణంగా నెలకొని ఉంటాయని, ఈ ప్రజ్ఞలు సందర్భోచితంగా వ్యక్త నిర్మాణాలుగా నైపుణ్యాలుగా ప్రకటితమౌతాయనీ అర్ధం చేసుకోకపోతే నిండైన పరిణామానికి దూరమై, మన సంకల్ప వాస్తవాలను సృష్టించుకోవడంలో విఫలమౌతామని మనకి అర్ధం అయ్యేలా చేయడమే ఈ రచన యొక్క ప్రధాన గమ్యం. పాలో కొయిలో - ది ఆల్కెమిస్ట్‌  ఇంగ్లీషు పుస్తకాన్ని తెనిగించినది శ్రీ కె.సురేష్‌. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలలో 66 భాషలలోకి అనువాదమయ్యింది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good