'సీతజోస్యం' పీఠికలో ఆయన చర్చించిన అంశాలు, లేవనెత్తిన ప్రశ్నలు :
1. రామాయణ గాధకున్న చారిత్రక ఆధారాలేమిటి? 2. రాముని వనవాసం ఏ ప్రాంతంలో? 3. రాక్షసులెవరు? వారి స్థితిగతులేమిటి? 4. ఋషులెవరు? యజ్ఞయాగాదుల ప్రాధాన్యత ఎందుకు? 5. ఆనాటి ఆయుధాలు ఎలాంటివి?
రామాయణంలో అనేక కాకమ్మ కథలున్నాయి. వాటిని నమ్మి రామాయణ కాలాన్ని నిర్ణయించలేం అంటారు నార్లగారు. ఒకచోట ద్వాపరం మరోచట త్రేతాయుగం, ఇంకొకచోట కలియుగ ప్రారంభమని రాయబడింది. రామ రావణ యుద్ధం కోటి సం||ల క్రితం జరిగిందని ఒక పండితుడన్నాడట! రావణునికి పది తలలు, ఇరవై చేతులు, హనుమంతునికి తోక, అతడు నూరు యోజనాల సముద్రాన్ని అవలీలగా లంఘించాడనీ, కుంభకర్ణున్ని నిద్రలేపడానికి వెయ్యి ఏనుగులతో తొక్కించినట్లు అనేక కాకమ్మ కథలున్నాయి. ఆ కథలాధారంగా రామాయణ కాలాన్ని నిర్ణయించలేం అని నార్లవారు అంటారు. కట్టుకథకు, గట్టి చరఇతకు భేదం తెలియని రామభక్తులను ఒక పక్కకునెట్టి, వేదాలను చారిత్రక దృష్టితో పరిశీలించాలంటారు. వేదాలలో రాముని ప్రసక్తి లేదు సరికదా కనీసం పాణిని వ్యాకరణంలో సైతం రాముని ప్రసక్తి లేదు అని నార్లగారంటారు.