సైన్స్‌ అంటే ఏమిటో మన దేశంలో సైన్స్‌ చదువుకున్నవాళ్ళకు సహితం తెలీదు. సాహిత్యం అంటే డిక్షనరీ కానట్టే సైన్స్‌ అంటే వైజ్ఞానిక సమాచారం కాదు. కాబట్టి జీవితానికి అర్థం ఏమిటి? అన్న సందేహం కలిగినప్పుడు .. వీరంతా సాయిబాబా దగ్గరకీ, తిరుపతి వెంకటేశ్వరుడి దగ్గరికీ పరుగులు తీస్తారు. జీవిత పరమార్థం దాకా పోనక్కరలేదు. సైన్స్‌ చదువుకున్న వాళ్ళు మూఢ నమ్మకాలకు ఇంగ్లీష్‌ పేర్లు పెట్టుకొని గతంలో కంటే ఎక్కువగా తమను తాము బెదరగొట్టుకునే వైనం కూడా చూస్తూనే ఉన్నాం.

వైజ్ఞానికులు 'కనుక్కున్న' ప్రతీ విషయమూ ఏదో ఒక భౌతిక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో కనుక్కున్నదే. కాని అవన్నీ ఇవాళ పాఠ్య పుస్తకాలలో అనాది అయిన పరమ సత్యాలుగా బోధించబడతాయి. గతంలో ఈ సత్యం తెలియని దినం ఒకటి వుండిందనీ, తెలుసుకోవలసిన అవసరం ఒక పరిస్థితిలో ఏర్పడిందనీ, ప్రయత్నం మీద తెలుసుకోవడం సాధ్యం అయిందనీ చెప్పడం సైన్స్‌ బోదనలో భాగం కాలేదు. దానివల్ల సైన్స్‌ చదువుకున్నవాళ్ళకు కొంత సమాచారం తెలుసును. కొన్ని సమీకరణలు తెలుసును... అంతేకాని కొత్త విషయాలకు అన్వయించడం తెలీదు. తద్వారానే జీవితాన్ని 'అర్థం' చేసుకోగలమన్న అవగాహనా లేదు. ఈ విషయంలో మన దేశానిది మరీ అన్యాయమయిన దుస్థితి. - బాలగోపాల్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good