దివ్యజ్ఞాన సమాజ చరిత్రలో, 'రహస్య సిద్ధాంత గ్రంథము' (ది సీక్రెట్ డాక్ట్రైన్ - రహస్య గ్రంథం) ప్రచురణ మానవాళికి జరిగిన మహత్తర ఉపకారం. ఈ ఉద్గ్రంథం 1888లో ప్రచురణ అయింది. దీనిని వ్రాసినవారు మేడం బ్లావట్స్కీ (1831-91), ఈ సమాజ ప్రధాన వ్యవస్థాపకురాలు, దివ్యజ్ఞాన సమాచారాన్ని ప్రపంచ ప్రజలకు తేలికగా అలవోకగా అందచేసిన మహోత్తమ వ్యక్తి.
బాహ్య ప్రపంచానికి అందని 'ధ్యాశ్లోకాలు' ఆధారంగా, బ్రహ్మాండం, ఉత్పత్తి, మానవుని ఆవిర్భావం, ప్రగతి వికాసాలను సవివరంగా ప్రస్తావిస్తూ ఇంతవరకు ప్రపంచ నాగరికతల్లో అంతర్గతంగా వుండి చాలావరకు కలుషితం కూడా అయిన విషయాలను పేర్కొంటూ 'నిజ'తత్త్వాన్ని తిరిగి వెలికితీసి బహుళ ప్రచారంలోనికి తీసుకురావడం ఈ గ్రంథంలో జరిగిన పని.
'సత్యమును మించిన ధర్మం మరొకటి లేదు' అనే మకుటాన్ని ఆశ్రయించిన దివ్యజ్ఞాన సమాజం ఆధునిక మానవాళికి ఎన్నో మహత్తర సత్యాలను అందచేసింది. ఈ సత్యాలను కూలంకషంగా అర్థం చేసుకొని ఆచరించడమే మానవాళికి తరుణోపాయం అని నొక్కి చెప్పింది.