ఎస్వీ సత్యనారాయణ అంటే ఉద్వేగపూరిత ఉపన్యాసానికి పెట్టింది పేరు. అభ్యుదయ దృక్పధం దానికి మూలశక్తి. మా స్నేహనికి సామాన్యాంశం కూడా అదే. అందుకే అనుకుంటా ఆయన ఈ వ్యాసాల పుస్తకానికి నన్నుముందు మాట వ్రాయమన్నది. పుస్తకంద్వారా స్నేహితునితో సంభాషణ - అదీ ఒక కొత్త అనుభవమే కదా అని నేను అంగీకరించాను.

తెలుగు సాహిత్య రంగంలో లబ్దప్రతిష్టులైన గురజాడ, శ్రీ శ్రీ, వట్టికోట ఆళ్వారుస్వామి, కాళోజీ, చాసో మొదలైన రచయితల గురించి ఎస్వీ వ్యాసాలు వ్రాశారంటే వాళ్ళు సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలపై ధ్వజమెత్తిన రచయితలు కావటంవల్లనే. తమ రచనలను సామాన్యుల, శ్రామికుల అభ్యుదయానికే నిబద్ధులై పని చేయటం వల్లనే. ఆ రకంగా అభ్యుదయ సాహిత్యోద్యమాన్ని ముందుకు నడిపించినందువల్లనే. భావకవిగా ప్రసిద్ధుడైన కృష్ణశాస్త్రి గురించి వ్రాసినా ఆయనలోని అభ్యుదయాంశే ఎస్వీకి ముఖ్యం అయింది.

దాదాపు ప్రతివ్యాసంలోనూ ఎస్వీ ఆయా రచయితల పుట్టుక పెరుగుదలకు సంబంధించిన జీవిత విశేషాలు కూడా ఇయ్యటం వల్ల ఈ పుస్తకం సాహిత్య విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకు ఉపయోగపడే సమాచార గనిగా కూడా వుంది. అభ్యుదయ సాహిత్య నిబద్ధత అంతస్సూత్రంగా ఎస్వీ సాగిస్తున్న సాహిత్యవిమర్శ ప్రస్థానంలో ఇదొక మైలురాయి. ఆయన కృషి నిరంతరం నిత్యోత్సాహంగా సాగాలని ఆకాంక్షిస్తూ - అభినందిస్తూ...
- కాత్యాయనీ విద్మహే

Write a review

Note: HTML is not translated!
Bad           Good