బాలబాలికల భాషా పరిపుష్టికీ, భావనా పటిమకూ, మనోవికాసానికీ, నీతి వర్తనకూ, దైవచింతనకూ నీతి, భక్తి బోధకములైన శతకముల పఠనం ఎంతగానో తోడ్పడుతుంది.
పూర్వకాలంలో అలతి, అలతి పదములతో కూడిన కృష్ణ శతకము, సుమతీ శతకము, వేమన శతకము వంటి శతకాలతో ప్రారంభించి, భాస్కర శతకము, భర్తృహరి నీతి శతకము, దాశరథి శతకము, శ్రీ కాళహస్తీశ్వర శతకము, నరసింహశతకము వంటి పెద్ద శతకాలను పిల్లల చేత కంఠస్థం చేయించేవారు. నేటి కాలంలో శతక పఠనం పాఠశాలలో కేవలనం తెలుగు పాఠ్య గ్రంథాలలోని కొన్ని పద్యాలకే పరిమితమై పోయింది.
శతకపఠనం వల్ల బాలబాలికలలో జ్ఞాపక శక్తి, ధారాశుద్ధి, వాక్శుద్ధి, భాషా సంపద, భావనా శబలత, మనోవికాసము, లోకానుభవము, సత్ప్రవర్తన, దైవ చింతన వృద్ధి పొందుతాయి.
సుప్రసిద్ధములైన తెలుగు శతకాలను బాలబాలికలచేత పఠింపజేసి వారిని స్వభాషా, స్వసంస్కృతీ సంప్రదాయ నిష్ఠులుగా తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇందుకు ధార్మిక సంస్ధలు, సాహితీ సంస్ధలు, విద్యాసంస్ధలు, అవిరాళంగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఆ కృషిలో భాగంగా మా వంతు ప్రయత్నంగా బహుళ ప్రచారం పొందిన భక్తి శతకాలను, నీతి శతకాలను టీకా తాత్పర్య సహితంగా ప్రచురించి సాధ్యమైనంత తక్కువ వెలకు విద్యార్ధి లోకానికి అందించాలనే సత్సంకల్పంతో ప్రారంభించిందే ఈ శతక సాహిత్యమాల. శతక పద్యాలను ప్రతిపదార్ధము, తాత్పర్య సహితంగానే నేర్పించాలి. కేవలం పద్యం-తాత్పర్యం (భావం) మాత్రమే చదివించకూడదు. ప్రతిపదార్ధం చదివించినప్పుడే పద్యంలోని పదాల విభజన, ప్రతిపదము యొక్క అర్ధం చక్కగా తెలుస్తుంది. విద్యార్ధి పద సంపద పెరిగి భాషా ప్రావీణ్యత ఏర్పడుతుంది. ఛందస్సు కూడా చెప్పగలిగితే పద్యరచన విధానం కూడా తెలుస్తుంది. ఈ పుస్తకంలో వేమన, సుమతీ, భాస్కర, కృష్ణ శతకములు ప్రతిపదార్ధ తాత్పర్యములు, భావము పొందుపరచబడినది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good