గుండు కొట్టించి వంటింటికే అంకిత చేశారు సూరమ్మని. అన్నదమ్ములు, ఇంట్లో వాళ్ళు ఆమె మనసునీ మెదడునీ నొక్కి పారేశారు. ఇరవయ్యో శతాబ్దపు మొదటి దశకంలోని సూరమ్మ, ఎడం చెయ్యీ, కుడిచెయ్యీ ఆనకుండా సేవలు చేసినపుడు కనీసం ఒక జత తెల్లబట్టలు కూడా కొనివ్వలేదు వాళ్ళు.
సూరమ్మ పెంచిన కమల, పరిస్థితులతో రాజీపడలేదు. తన మార్గం తాను తెలుసుకుంది. కుటుంబ గౌరవం, పరువూ, ప్రతిష్టా యివి స్త్రీలకే కాదు, పురుషులకు కూడా వుండాలన్నది. ఉద్యోగం చేసుకుంటూ తన దారి తాను ఎన్నుకున్నది రెండవ తరం కమల.
ఇక మూడవ తరానికి చెందిన పద్మ, కొడుకులనీ, కోడళ్ళనీ సమంగా పదేసి నెలలు మోసి, కని, పాలు యిచ్చి పెంచి పెద్ద చేస్తారు. పుట్టుకలో, పెరగడంలో కాని వ్యత్యాసం, ఆడపిల్ల పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ఎందుకు పరాయై పోతుంది? ఆస్తి పాస్తులు కాదు, ప్రేమాభిమానాలలో, కష్టసుఖాల్లో సమానత్వం లేకపోతే ఎలా? అని ప్రశ్నిస్తుంది. తన భర్తని తాను నిర్ణయించుకుని పెళ్ళి చేసుకున్న పద్మ.
ఈ పెళ్ళిళ్ళు ఆచారాలు, దేశ విదేశ సంప్రదాయాలూ వీటన్నింటినీ పక్కకి నెట్టి నాలుగో తరానికి చెందిన సౌజన్య ఆత్మవిశ్వాసంతో కొత్త ప్రపంచాన్ని, కొత్త జీవితాన్నీ తెలుసుకోవాలన్న వుత్సాహంతో అమెరికాలోని అట్టాంటిక పయనమై వెడుతుంది. పైచదువులకోసం!  ఈ యిరవయ్యో శతాబ్ది మొదటి దశకంలో ఆరంభమైన సూరీడు జీవితం అదే శతాబ్దపు ఆఖరి దశకంలో ఒక నవయువతి విజ్ఞానతృష్ణకు పునాది కాగా నాలుగు తరాల నారీ జీవితాన్ని కలుపుతున్న అదృశ్య బంధం ఈ నవల. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good