జేమ్స్‌ పెట్రాస్‌ అమెరికాలో పుట్టి పెరిగి నాలుగు దశాబ్దాలకు పైగా సామాజిక శాస్త్ర ఆచార్యుడుగా పనిచేసి ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకున్న మార్క్సిస్టు మేధావి. బాస్టన్‌కు చెందిన పెట్రాస్‌ బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో పిహెచ్‌.డి చేసి, న్యూయార్క్ల్‌ఓని బింగ్‌హాప్టన్‌ యూనివర్సిటీలోనూ, కెనడాలోని హాలిఫాక్స్‌ సెంట్‌ మేరీస్‌ యూనివర్సిటిలోనూ సామాజిక శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. అభివృద్ధి అధ్యయనాలు, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌, పశ్చిమాసియా దేశాల వ్యవహారాలు, విప్లవోద్యమాలు, వర్గ విశ్లేషణ, సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ, సంస్కృతి వంటి అంశాలలో నిష్ణాతుడు. డెబ్బై ఏడేళ్ళ వయసులో ఇప్పటికీ నిరంతరం రచిస్తూ, లాటిన్‌ అమెరికా దేశాలు పర్యటిస్తూ, అక్కడి ప్రజా ఉద్యమాలకు సహకరిస్తూ ఉన్న పెట్రాస్‌ తనను తాను ''సామ్రాజ్యవాద వ్యతిరేక, విప్లవ'' కార్యకర్తగా, రచయితగా చెప్పుకుంటారు.

గతంలోనే మనకు సమాజంలోకి చొరబడుతున్న సామ్రాజ్యవాద సంస్కృతిని విశ్లేషించడానికి పెట్రాస్‌ చూపిన వెలుగులో ఆలోచనలు ప్రకటించినవారున్నారు. అలాగే వెనిజులాలో ఛావెజ్‌ చేపట్టిన విధానాలను విమర్శిస్తూ పెట్రాస్‌ రాసిన వ్యాసాలను భారత మార్క్సిస్టు రచయితలు పశ్చిమ బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వానికి అన్వయించి విశ్లేషించారు. ఆసియా సోషల్‌ ఫోరం సందర్భంగా మొత్తంగా ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్ధల కుట్రను విప్పి చెప్పడానికి పెట్రాస్‌ విశ్లేషణలు ఉపయోగించుకున్న వారున్నారు.

లాటిన్‌ అమెరికన్‌ ప్రజా ఉద్యమాలతో ఆయన మమేకమైన తీరు, మార్క్సిస్టు సామాజిక శాస్త్రంలో ఆయన చేసిన అన్వేషణలు, ప్రంపచీకరణ రాజకీయార్ధిక విధానాల గుట్టు విప్పడానికి ఆయన చూపిన వెలుగు, అమెరికా సామ్రాజ్యవాద కుటిల యత్నాలనూ, యుద్ధ తంత్రాన్నీ, రాజకీయార్ధిక, దోపిడీ పీడనలనూ విశ్లేషించడంలో ఆయన విస్తృతి, ప్రజా ఉద్యమాల ముసుగులో, స్వచ్చంద సంస్ధల పేరుతో సామ్రాజ్యవాద నిధుల, సంస్ధల భావజాల ప్రచారం, ప్రభావం గురించి ఆయన చేసిన హెచ్చరికలు తెలుగు పత్రికలలో, ఉపన్యాసకుల ద్వారా పాఠకులకు అందాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good