సంస్కృతంలో తొలుత రచించబడిన కథాగ్రంథం గుణాఢ్య మహాకవి యొక్క ''బృహత్కథ''. ఈ గ్రంథం నుండే విష్ణుశర్మ అనే పండితుడు కొన్ని కథలు తీసుకొని 5వ శతాబ్ధమున 'పంచతంత్రము' అనే సంస్కృత గ్రంథమును రచించినాడు. బాలబాలికల పాలిటి జ్ఞాన ప్రసాదమైన యీ పంచతంత్రం బాలసాహిత్య నందనవనంలో పారిజాత సుగంధమై, భారత ఉపఖండాన్ని దాటి ఆఫ్రికా, ఆసియా, యూరప్ ఖండాల్లోకి పాకి విశ్వమంతా వ్యాపించి ప్రపంచంలోని 60పైగా భాషల్లోకి 200 అనువాదాలు వెలువడి అనన్య ప్రసిద్ధి చెందింది. పంచతంత్రంలోని మొదటి నాలుగు తంత్రములలో (మిత్రలాభము, మిత్రభేదము, విగ్రహము, సంధి) మృగ పక్ష్యాదులే కథానాయకులు. యీ పాత్రల ద్వారా రచయిత కేవలం నీతులనే గాక రాజనీతి జ్ఞానమును కూడా వెల్లడించాడు. ఈ పంచతంత్రంలో గుప్తమైయున్న నీతిని బాలబాలికలకు ఆసక్తి కలిగించేవిధంగా, వారికి సుబోధకమగు రీతిలో -ఉపయుక్తమనుకున్న కొన్ని కథలను (50) సరళమైన భాషలో అందిస్తున్నారు ఈ పుస్తకం ద్వారా శ్రీ పడాల రామారావు గారు. బాల్యంలోనే మంచి నడవడి, నీతి అలవడేందుకు, లోకజ్ఞానం కలిగేందుకు పిల్లలతో తప్పక చదివించాల్సిన నీతి కథలివి. |