''సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం'' - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌


ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. లక్షలకోట్ల ప్రజాధనం పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. 'అందలం ఎక్కినవాడికి మోసేవాడు చులకన' అన్నట్లు అధికారం చిక్కగానే ఒక్కమాటు స్వార్థం, ఆశ్రిత పక్షపాతం పడగవిప్పి నాట్యం చేస్తాయి. అందింది, అందనిది కూడా వివిధ పద్ధతుల్లో సొంతం చేసుకోవడం తమ హక్కుగా వ్యవహరించే అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మన దేశంలో కొదువలేదు. సామాన్య ప్రజల హక్కులన్నీ ఓట్లు వేయగానే, అంతవరకు అతి వినయంగా అర్థించిన అభ్యర్థికి అధికారం కట్టబెట్టడంలో ముగిసిపోతున్నాయి. అటుపైన పౌరుడు దీనాతిదీనుడైపోతున్నాడు. ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా అది 'రాజకోట రహస్యమే'. రోజుల తరబడి తిరిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు కూడా ఈ విషయంలో పదునులేని కత్తులే!


ఈ దుస్థితి నుండి ప్రజలను బయటపడవేయడానికి ఉద్దేశించినదే 'సమాచార హక్కు చట్టం'. సుమారు 55 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత 2005లో ఈ చట్టం కళ్ళు తెరిచింది. 1766వ సం||లోనే స్వీడన్‌ దేశం సమాచార హక్కు చట్టాన్ని అమలుపరచి, చిన్న దేశమైనా 'గోరంత దీపం కొండంత వెలుగు' అన్నట్లు, దాదాపు 60 దేశాల్లో ఈ చట్టం నిర్మాణానికి స్ఫూర్తినిచ్చింది. మన దేశం 2005లో ఈ చట్టాన్ని చేసింది. దీన్ని అవగాహన చేసుకోవడం, సద్వినియోగం చేసుకోవడంలో ప్రజలకు సహాయపడటం సమాచార హక్కు కమీషనర్ల ప్రధాన బాధ్యత. అయితే, ఇంకా ఈ దిశగా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. సమాచార సాధనాలు, వార్తా పత్రికలు, సభలు, సమావేశాల ద్వారా విస్తృతంగా సమాచార హక్కు చట్టం గురించి తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. ఢిల్లీలో ఒక ఔత్సాహికుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు కోరటం, తదితర అంశాలను కోరటం, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక వ్యక్తి జిల్లా జడ్జి ఇచ్చిన తీర్పుకి వివరణ కోరటం దానిమీద ఉన్నత న్యాయస్థానం మందలింపు వంటివి మినహాయిస్తే, ప్రజల్లో క్రమంగా సమాచార హక్కు చట్టం పట్ల ఆసక్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది శుభపరిణామం. ఈ చట్టాన్ని సద్వినియోగపరిస్తే ఇది వజ్రాయుధమే. - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌.

Write a review

Note: HTML is not translated!
Bad           Good