మనిషి జీవితంలో సాహిత్యానికి గల పాత్రను లోతైన తాత్విక దృక్పథంతో పరిశీలించి చేసిన విశ్లేషణలు ఈ పుస్తకంలో ఉన్నాయి. స్థిరపడిపోయిన ఎన్నో మౌలిక భావనలను, ధోరణులను ప్రశ్నిస్తూ విస్తారమైన అన్వేషణ సాగించారాయన. సాహిత్యంపై చెదురుమదురుగానే అయినా చిక్కగా రాసిన వ్యాసాలు, సవిూక్షలు, ముందుమాటలు, ఇంటర్వ్యూల సంకలనమిది.
''దేనికయినా ఒక్క వాక్యంలో నిర్వచనం ఇవ్వడంలో సమస్యలున్నాయి గానీ సాహిత్యం పాత్రను ఒక్క వాక్యంలో నిర్వచించడమంటే, జీవితంలోని ఖాళీలను పూర్తిచేయడం సాహిత్యం పాత్ర అని చెప్పవచ్చు.''
''మన కళ్లముందు ఉండీ మనం చూడని చూడజాలని విషయాలనేకం ఉంటాయి. కొన్ని భయం వల్ల చూడము. కొన్ని అభద్రత వల్ల చూడము. కొన్ని ఒక బలమైన భావజాలం ప్రభావం వల్ల మన ఎదుట ఉండీ మనకు కనిపించవు. ఒక్క్కొసారి మనకు అలవడిన దృక్కోణం వల్లగానీ, మనం ఎంచుకున్న దృక్కోణం వల్లగానీ కొన్ని విషయాలు కళ్ల ముందే ఉండీ కనిపించవు. వీటిలో విడివిడి విషయాలే కావు, సామాజిక క్రమాలు కూడా ఉంటాయి. వీటిని మనకు చూపించడమే సాహిత్యం చేసే పనులలో ఒకటి.''
''సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంలో చర్చించడం పొరబాటు. ఉద్యమాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న భాగం మాత్రమే. సాహిత్యం పాత్ర దానికి పరిమితం కాదు. అది జీవితమంత విస్తృతమైనది.''