"ఈ సంకలనాన్ని ఒక రకంగా స్వీయరచనల చరిత్రగా చూసినా కూడా, నేపధ్యంలో సమాజ చరిత్ర కూడా వెన్నంటే నడించింది...
"దీన్ని చదివే క్రమంలో మన ఆసక్తినీ, ఏకాగ్రతని పట్టి ఉంచేది 'చదువులూ - సంధ్యారాగాలు' అనే విభాగం. భూస్వామ్య కుటుంబంలో పుట్టి గారాబంగా పెరిగిన ఒక అమ్మాయి 'శ్రోత్రియ వంశ సంభవుడు' గా వర్ణింపబడ్డ వేణుగారిని సహచరుడుగా పొందినప్పటికీ, ఆ భావజాల బంధనాల్నుండి ఇద్దరూ బయటికి వచ్చి కాలగమనంలో కమ్యునిస్టు భావాలను వంటబట్టించుకున్నారు..."--- ముదునూరి భారతి
"1996 ప్రాంతంలోనే కాజీపేట ఫాతిమానగర్ లో కృష్ణక్క సమక్షంలో కెఎస్, ఎస్ఎం, చలసాని, రమేశ్ బాబు వేడివేడిగా రాజకీయాలు చర్చించుకోవడం అక్కడితో ఆగిపోయిందా? ఆ నలుగురికి, ఆ ఇంటికి, ఆ ప్రాంతానికి పరిమితము అయిందా? అక్కడి నుంచీ ఆర్ ఇసీకీ, కాకతీయ మెడికల్ కాలేజీకి, ఉక్కు ఉద్యమానికీ, మాలె పార్టీ నిర్మాణానికి విస్తరించినప్పుడు, ఆ సాక్షిభూతమైన వ్యక్తీ అనుభవాన్ని ఏమనాలి? పోనీ, ఇవ్వాళ అది కేవలం జ్ఞాపకమా? ఒక నాస్టాల్జియానా?"--- వివి
"తాను మాట్లాడాలనుకున్నప్పుడల్లా కృష్ణాబాయి రాసింది. అంతే. అందుకే ఈ రచనలన్నీ మనల్ని పలకరించి నట్టుంటాయి. జీవితం, దాన్ని పెనవేసుకున్న సమాజం, ఆ రెంటినీ తన గుండెల్లో దాచుకున్న సాహిత్యం యీ సన్నని పలకరింపుల్లో మనల్ని తాకుతాయి... సాహిత్యంలో పలకరింపుకున్న సౌందర్యం పదాడంబరానికి ఉండదు. ఇక్కడ ఈ పేజీల్లో నేను ఆ సౌందర్యాన్నే చూశాను..."-- జి. కల్యాణరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good