మానవ సంబంధాలను నిలిపే కథానికలు

'కథానిక ఒక మెరుపు వంటిది.

దానిలో వేగం ప్రధానం. వైచిత్రి ప్రధానం'

- పాలగుమ్మి పద్మరాజు

ఇది శివ ప్రసాద్‌ గారి మొట్టమొదటి కథా సంపుటి. 18 కథలున్నై దీనిలో.

ఈ సంపుటిలోని కథలన్నిటా చక్కటి వస్తు వైవిధ్యం చోటు చేసుకున్నది.

మొట్టమొదటి కథ - 'స్వప్నం'. నిజానికి ఇది ఒక రచయిత స్వీయ గాథే! ఆ రచయిత శివ ప్రసాద్‌ అనీ, ఇది ఆయన ఆత్మీయతా ముద్రని సంతరించుకుని ఉన్నదని ఇట్టే తెలిసిపోతుంది. ఈ కారణం వల్లనే - ఉత్త పురుషలో చెప్పిన కథకి-మంచి అలరింపు వచ్చింది. సీరియస్‌ రచయితల్లో చాలా మందికి 'ఇక్కడినుంచి ఎక్కడికి?' అనే నిర్ణయ ప్రక్రియలో - నాలుగు రోడ్ల కూడలిలో నిలబడక తప్పనిసరి పరిస్థితి ఎదురౌతుంది. అప్పుడు ఎవరో ఒక రోల్‌ మోడల్‌ స్ఫూర్తి చేదివ్వె అవుతుంది. దారి చూపి ముందుకు నడిపిస్తుంది. ఇదే ఇతివృత్తం ఈ కథలో! రోల్‌ మోడలేమో థీరజ్‌! అతనేం సాధించి రచయితకు రోల్‌ మోడల్‌ అయ్యాడో... చదవండి. మంచి సందేశాత్మకమైన కథ! కలలు కనటమే కాక, వాటిని సాకారం చేసుకునేందుకు ఏం కావాలో కూడా చెప్పకయే చెప్పిన కథ- ఆలోచనీయమైన రచన ఈ 'స్వప్నం'.

'సాదృశ్యం' మనం కొన్ని ఇళ్ళల్లో నిత్యమూ చూసే సంభవాల కలగలుపే. చదవులో ఏవరేజ్‌ గా ఉన్న యువకుడికి అందరూ లెసన్‌ పీకే వారే. క్షణక్షణమూ పక్కవాడి పోలికతో గుచ్చి చంపటమే. పనికిరానివాడుగా ముద్ర వేయటమే! చివరికి అతను తన స్వయం ప్రతిభతో, సృజనాత్మకత ప్రతిభతో- ఏ అద్భుతమో సాధిస్తే, జ్ఞానోదయమై - వీరంతా చప్పట్లు కొట్టటానికి సిద్ధం! కానీ, అతని అంతరంగం వీరాశించిన దాన్ని పలక్కపోతే..? పర్యవసానాన్ని చదవండి.

పేదరికానికి తోడు, కుల వివక్ష కూడా పసి మొగ్గల ప్రతిభాప్రాభవాన్ని తుంచస్తుంటే-రేపటి భవిత అయోమయం అవుతుంది. 'ఉత్సవం'లో సమానావకాశం దక్కితే- జ్యోతి లాంటి పిల్లలు ఏం సాధించగలరో తెలుస్తుంది.

'యాత్ర' కథలో వృద్ధులకీ సంతానానికీ మధ్యన తరాల అంతరాన్ని చెప్పే ఇతివృత్తాన్నే భిన్న కోణంలో స్పృశించారు రచయిత.

భక్తి, ముక్తి, ఆధ్యాత్మికత, విశ్వాసం-అన్నీ సరే. వాటి పేరున జరిగే ఆరాటాలకీ, దోపిడీలకీ కొందరు బుద్ధి జీవుల నిరసన. అలాంటివారంతా కోరుకునే ఒక ఆస్తికతా రూపం - 'దైవం మానుష రూపేణా' కథ. పొరుగు వాడికి సాయ పడే ఆదర్శ మూర్తులే ప్రత్యక్ష దైవాలు అని సందేశం....

పేజీలు : 126

Write a review

Note: HTML is not translated!
Bad           Good