సంగీతం సామవేదంలోంచి పుట్టింది. కాబట్టి వేదానికి ఉన్నంత విలువ ఇవ్వాలి. సంగీతం అంటే సప్తస్వరాలు గదా! దక్షిణ, ఉత్తర భారతదేశ శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం, సినిమా సంగీతం, పాశ్చాత్య సంగీతం ఇలా ఏరకం సంగీతం అయినా సంగీతానికి మూలం సప్తస్వరాలే. సప్తస్వరాలకు అందని ధ్వనిని గోల అంటాం.

వ్యక్తిగత అనుభూతిని సార్వజనీనమైన అనుభవంగా రూపాంతరం చేయగలగడమే ''కళ''. ఆ కళ ద్వారా ప్రజాహృదయాన్ని ఉత్తేజితం చేసి ఉన్నత స్థాయికి చేర్చాలి. ఆ లక్ష్యసాధనకు కళాకారుడు, మహా కఠోరమైన మానసిక యజ్ఞం చేయవలసి వుంటుంది. ఆ నిబద్దత వల్లనే, త్యాగరాజు నిధిని కోరక రాముని సన్నిధిని కోరి, యోగిరాజుగా జీవనం సాగించాడు. కాని రాజసన్మానాలు, కనకాభిషేకాలు, గజారోహణలతో వైదుష్యానికి వెలకట్టే లోకం, అతనికి పాండిత్యం లేదని ప్రచారం చేసింది. ఫలితం 'పంచరత్న కీర్తనల ప్రాదుర్భావం''.

ఆ శ్రీరాముని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడైన త్యాగరాజు, కర్ణాటక సంగీత విహాయసంలో గాయనీ, గాయక తరళ తారకా దుగ్ధపథంలో, మ¬జ్వల తరణి సన్నిభుడుగా, అజరామరుడైన వాగ్గేయకారకుడుగా ప్రకాశిస్తున్నాడు.

శ్రీ అచ్యుత రామశాస్త్రిగారు చేపట్టిన పంచరత్న కీర్తనల వివరణ ప్రక్రియ ఒక ఉద్వేగమార్గాన జరిపే సత్యాన్వేషణగా రూపుదిద్దుకున్నది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good