స్వచ్ఛమయిన తెలుగు నుడికారంతో, సంప్రదాయ భాషతో ''రుణం' అనే నామకరణం చేయడంలోనే యీ నవల ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. మారుతీరావుగారు అటు ఆంగ్ల సాహిత్యాన్నీ, ఇటు తెలుగు సాహిత్యాన్నీ ఔపోశన పట్టడమే కాకుండా అక్షరజ్ఞానం అబ్బినప్పటినుంచీ విస్తృత పఠనం కొనసాగిస్తున్నారు. ఆ అనుభవాన్నంతటినీ యీ ''రుణం'' నవలలో క్రోడీకరించి పదిలపరిచారాయన. కొన్ని పాత్రలు భారతీయ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకలుగా, నిలువెత్తు సాక్ష్యాధారాలుగా రూపుదిద్దుకున్నాయి. మారుతీరావుగారు భారతీయ సంస్కృతీ సంప్రదాయ శక్తులనూ, ప్రత్యేకించి స్వచ్ఛమైన, పవిత్రమైన భారతీయతను ఆవిష్కరించారు. మహాభారతంలో అడవులపాలై, అజ్ఞాతవాసం చేస్తున్న పాండవులకు అన్ని సందర్భాలలోనూ అడగా నిలిచి వారిని పాలకులుగా ప్రతిష్టించిన కర్మయోగి శ్రీకృష్ణుడు అబ్బుశాస్త్రిలో కనిపిస్తాడు. తెలుగు నవలాసాహిత్యం తొలిదశలో కందుకూరి వీరేశలింగం పంతులుగారి 'రాజశేఖర చరిత్ర', చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి 'గణపతి', విశ్వనాధ సత్యనారాయణగారి 'వేయిపడగలు', అడివి బాపిరాజుగారి 'నారాయణరావు' మొదలైన ఎన్నో నవలలు వచ్చాయి. ఇది భారతీయ నవల. ఈ దేశ సంస్కృతీ సంప్రదాయాలకు, కర్మభూమిలోని పవిత్రతకూ ఆటపట్టయిన నవల.
సి.యస్.రావు
ప్రముఖ కథా, నాటక రచయిత