రుద్రుడు
''పదునెనిమిది సంవత్సరాలు నెత్తిమీదికి వచ్చేసాయి. మూడు పొద్దులా మూడు పళ్ళెరాల బువ్వ ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా ఆరగించడం తప్ప అవసరానికి ఉపయోగపడే లక్షణం ఒక్కటి కూడా లేదు...''
పెద్ద గొంతుతో, మాటమాటలోను తీవ్రమైన అసహ్యాన్ని కనిపింప చేస్తూ చెవులు చిల్లులు పడిపోయేలా అరవటం మొదలు పెట్టింది రుద్రుడి పిన్నమ్మ.
పెద్ద పెద్ద తాటియాకుల ఇల్లు అది. పడమటి దిశలో వుంటుంది. వంట పాత్రలు కనిపించే గది.
ఒక మూలగా కూర్చుని, పొయ్యి మీద పాత్రలోని జొన్న అంబలిని తన పళ్ళెరంలోకి వంపుకుంటున్న రుద్రుడి మనస్సు చివుక్కుమన్నది ఒక్కసారిగా.
''నేను ఏం తప్పు చేశాను పిన్నీ?'' చేతిలోకి తీసుకున్న అంబలి పాత్రను తిరిగి పొయ్యిమీద పెట్టేస్తూ చిన్న కంఠంతో అడిగాడు.
''చూశారా? ఎదురు సమాధానాలు ఎలా ఇస్తున్నాడో? చూశారా....వాడి మొఖంలో ఎంత తల బిరుసుతనం కనిపిస్తుందో'' తలను పక్కకు తిప్పి మరోసారి గయ్మన్నది అతని పిన్నమ్మ.
ఎంత వద్దని అనుకున్నా ఆగకుండా నీటితో నిండిపోయాయి రుద్రుడి కళ్ళు.
వేగుచుక్క వెలుపలికి రాకముందే చిమ్మచీకట్లో ముళ్ళపొదలకు అడ్డంపడి తూర్పుదిక్కున తమకున్న పొలం దగ్గరికి పోయాడతను ఆ రోజు ఉదయం.....