చదువురాని శ్రమజీవులు, తమకోసం, తమలాంటి అసంఖ్యాక జనం కోసం సృష్టించుకొన్న సాహిత్యం జానపదసాహిత్యం. జనపదం అంటే పల్లెటూళ్లు, జానపదులంటే పల్లీయులు. ఈ పల్లీయులకు సంబంధించినదే జానపద సాహిత్యం. జానపదులకు సంబంధించిన కట్టుబొట్టు వ్యవహారం, నమ్మకాలు, విశ్వాసాలు, పండుగలు పబ్బాలు, ఆహార విహారాలు, వివాహాది శుభకార్యాలు, కర్మకాండలు, పూజలు వంటి సంస్కృతికి, జీవనానికీ చెందిన సర్వ విజ్ఞానాన్ని జానపద విజ్ఞానం అంటాం.

పాటల రూపంలో వున్న గేయాలనే జానపద గేయాలుగా పిలుస్తాం. ఇవి ఆశువుగా ఎప్పటికప్పుడు సృష్టించబడతాయి. మౌఖిక ప్రచారంతోనే జీవించి ఉంటాయి. అంటే ఒకతరం నుంచీ మరో తరానికి కేవలం నోటి ద్వారానే అందివ్వబడతాయి. ఇలాంటి ఈ గేయాలలో కుటుంబ గేయాలున్నాయి. శ్రామిక గేయాలున్నాయి. వేడుక పాటలు ఉన్నాయి. ఇంకా ఇలాంటివి పలు రకాల పాటలున్నాయి.

అలాంటి వాటిలో పని పాటలు కొన్ని. పని చేస్తూ శ్రమించేటప్పుడు పాడేవి కాబట్టి వీటిని శ్రామిక గేయాలుగా కూడా పిలుస్తారు. వ్యవసాయ రంగంలో వివిధ రకాలైన పనులు చేసేట్పుడు, బరువులెత్తేటప్పుడు, చాపలు, బుట్టలు అల్లేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు రకరకాల పాటలు పాడుకుంటారు. ఇవన్నీ పని పాటలే. వాటిలో కొన్నింటిని గురించి ఈ పుస్తకంలో చదువుకొంటారు. ఈ పాటలు తెలుగుజాతి జీవనం అంతా కళ్లకు గట్టేట్లుగా చూపుతాయి. వీటిని తెలుగు వారందరూ ఆదరించి తీరవలసిందే. అభినందించవలసిందే. ఆనందించవలసిందే. తరతరాలకు అందించవలసిందే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good