'నిశిత తనకి కాలులేదని, తనో ఓటి కుండనని అనుకుంటోంది. తనమీద తనే జాలిపడ్తోంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. కానీ అది తప్పు... ఎలా అంటే!
ఒక తోటమాలికి తన కావడిలో ఒకటి మంచికుండ ఇంకోటి చిల్లికుండ వున్నాయట. ఏటి నుండి నీళ్లు తెస్తున్నప్పుడు మంచికుండ తోటను తడిపితే చిల్లికుండ తోటకెళ్లే దారిలో వుండే మొక్కల్ని తడిపేదట... ఆ విషయం ఆ తోటమాలికికాని, చిల్లికుండకి కాని తెలియదు. దారిలో వున్న పూలమొక్కలు ఎన్నో అందమైన పూలుపూసి ఎంతో మంది స్త్రీల శిగలను అలరిస్తుంటే - తోటమాలి చిల్లికుండను ప్రేమతో దగ్గరకి తీసుకొని 'పగిలిపోయిన నిన్ను నిజానికి పారేయాలి. కానీ నీమీద నాకున్న ప్రేమ అందుకు అనుమతించదు. అందుకే నాకు తోచిన పద్ధతిలో నిన్ను వాడుకొని నీ ఉపయోగం. ఎంతవరకు వుందో అంతవరకు నిన్ను ఉపయోగించుకుంటాను.' అని తోటకెళ్లే దారిలో మంచి, మంచి పూలమొక్కల్ని నాటి చిల్లికుండను తన కావడిలోంచి తియ్యకుండా వుంచుకున్నాడట...
దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే ''పనికిరాని కొండకన్నా పగిలిన కుండమిన్న'' అని...
నిశిత లాంటి వాళ్లు ఎందరో వున్న ఒక సేవాసంస్థను కలిసి మాట్లాడివచ్చాను. అక్కడవాళ్లు చేస్తున్న పనుల్ని గమనించి ఆశ్చర్యపోయాను. వాళ్లు చేస్తున్న ప్రతి పనిలో ఉపయోగంవుంది. ఆర్థికపరమైన లాభాలున్నాయి. మానసికమైన ఉల్లాసం వుంది. అదొక బడి, అదొకగుడి అదొక పరిశ్రమ.
నిశిత తరుపున నేను డొనేట్‌ చేస్తున్న ఈ డబ్బుతో రేపటినుండి నిశిత అక్కడే వుంటుంది. అలా వుండేందుకు అన్ని ఏర్పాట్లు నేను చేసి వచ్చాను. ఇకపై నిశిత ఎవరికి బరువుకాదు. తనని తను పోషించుకుంటుంది. తనకు తనే సెక్యూరిటీగా నిలబడ్తుంది. నిశితే కాదు. నిశితలాంటి వాళ్లు ఎందరో అక్కడ ఆత్మస్థయిర్యంతో ఆనందంగా వున్నారు. ఈ విషయంపై నిశిత కుటుంబ సభ్యులతో మాట్లాడవలసి వుంది. వాళ్ల అంగీకారంతోనే ఈ పని జరుగుతుంది.'' అన్నాడు ద్రోణ.
ద్రోణలోని మానవత్వంతో కూడిన ఆ చర్యని అభినందిస్తున్నట్లు మళ్లీ చప్పట్లు మారుమోగాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good