అక్షరాభ్యాసం నాడు ఓనమాలు దిద్దించినంతమాత్రాన మన బ్రతుకునూ తీర్చిదిద్దుతామంటే ఎలా? అక్షరాభ్యాసం వరకే మన అనుకరణ... బ్రతుకంతా స్వీయవిభక్తే. వందేళ్ళ బ్రతుకు కావ్యం సాగాల్సింది ఈ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్‌తోనే. ఇటువంటి స్వకీయ వర్తనంతో మనల్ని మనం నిర్వచించుకుంటూ పోవాలి. ఈ నిర్వచనంతోనే మన నిర్వహణా సామర్థ్యం అభివ్యక్తమవుతుండాలి. అందుకే ఎప్పటికీ మనకు మనంగా వ్యక్తం కావల్సిందే తప్ప మరొకరి నిర్వచనానికి అద్దం కాకూడడు. అప్పుడే మన బ్రతుకు అర్థవంతమయ్యేది.
సో, బ్రతుకు మనది... బ్రతుకును భారం అనుకోకుండా బ్రతకాల్సింది మనం... మెరుగు పెట్టాల్సింది మనం. అప్పుడే మన బ్రతుకు మెరుగవుతుంది. ఈ బ్రతుకు పుస్తకంలోని ఏ పుట తెరిచినా మన ఆలోచనలే, మన ఆచరణలే. ఎటువంటివారినైనా అక్షరాల వెంట పరుగులు పెట్టించేవి కావాలి. అంతేకానీ ఎవరి నిర్వచనాలకో మనం నిలువెత్తు ప్రతిబింబాలుగా ఆ అక్షరాలలోకి వొదిగి కనిపించకూడదు.
మన శక్తిని అంచనా వేయగల సామర్థ్యం ఏ ఇతర మానవ శక్తులకూ లేదు. ఎటునుండైనా మన జీవితాలను వెలకట్టగల షరాబులం మనమే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good