రవీంద్రనాథ ఠాకూర్ విశ్వకవిగా విఖ్యాతి కెక్కినాడు. ఆయన అమృతలేఖని నుంచి కవితలు, కథానికలు, నవలలు, నాటకాలు పరశ్శతంగా వెలువడినవి. ఆ మహాకవి స్పర్శతో పల్లవింపని సాహిత్యశాఖ ఏదీ కనిపించదు. పైగా, ఆయన గాయకుడు, చిత్రకారుడు కూడా! ఒక సహృదయుడు ప్రశంసించినట్లు, ఠాకూర్ అన్ని కాలాలకూ, అన్ని సంస్కృతులకూ వారసుడు, కవిగా, కథానికుడుగా, నాటక కర్తగా సహృదయలోకానికి చిరపరిచితులైన రవీంద్రులు చక్కనివీ చిక్కనివీ వ్యాసాలు ఎన్నో రచించారు. ఆ విషయం అందరికి తెలియదు. నిజానికి, ఆయన కావ్యాలూ కథానికలూ - క్వాచిత్కంగా నవలలూ నాటకాలూ మొదలైనవే మనదేశ భాషలలోనికి అనువాదములైనవి. కాని వ్యాసాలు అంతగా అమాదితం కాలేదు. అందువల్ల, ఈ లోపమును తీర్చాలనే సంకల్పంతో రవీంద్రవ్యాసావళిని రెండు సంపుటాలలో అన్ని దేశభాషలలోనూ ప్రచురించుటకు సాహిత్య అకాడెమీవారు నిశ్చయించారు. ప్రస్తుతం వెలువడుతున్న వ్యాసావళి రెండవ సంపుటంలో సాహిత్య విషయాలు, లేఖలు, మొదలైనవి అందాలు అందిస్తున్నవి. సాహితీ ప్రియులకు ఇవి ఆస్వాద్యము అగువనడంలో సందేహం లేదు. ఈ సంపుటం తెలుగు పాఠకలోకాన్ని అలరిస్తుందని ఆశిస్తున్నాము. |