ఎక్కడో కళింగలో పుట్టి పెరిగిన గజపతుల వంశంలో మేటి అయిన మహారాజు ప్రతాపరుద్రగజపతి,మహారాణి లక్ష్మిదేవి, వీరి కుమార్తె చిన్నాదేవి, నరహరి పాత్రుడు, వీరభద్ర దేవుల చుట్టూ తిరిగిన కథ, అనుకోకుండా మలుపు తిరిగి మూరురాయగండ, అష్టదిక్కు, రాయమనోభయంకర, గజపతిదళ విభాళ, శ్రీ వీరప్రతాప, విజయనగరాధీశ్వర శ్రీకృష్ణదేవరాయల చుట్టూ తిరిగి, నరహరిపాత్రునికి దక్కాల్సిన చిన్నాదేవి, కృష్ణరాయని వరించాల్సి వచ్చిన నేపథ్యాన్ని ఎంతో నాటకీయంగా వర్ణించారు. కటకం, హంపీ, విజయనగరం, ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి నగరాలు, బీదరు, బీజపూరు దుర్గాల మధ్య జరిగిన చారిత్రక సంఘటనలను, సన్నివేశాలను మనముందుంచటానికి సుబ్బరామయ్యగారు ఒక చక్కటి కథనాన్ని నడిపించడంలో చేయి తిరిగిన చరిత్రకారుని కంటే మిన్నగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
ఉత్కళ-విజయనగర సామ్రాజ్యాల రాజకీయ చదరంగంలో నంది తిమ్మన నవీంద్రునితో 'పారిజాతాపహరణము' కావ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలకు వినిపింపజేసిన మహామంత్రి తిమ్మరుసు వైనం నవలలో నడిపించిన తీరు అనన్యం, మహాద్భుతం.
పేజీలు : 136