చేతుల్లో ముఖాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ పిల్ల తలను నిమురుతూ ''మీ నాన్నకు ఏమయిందమ్మా? ఎందుకని పడిపోయాడు?'' అనునయంగా అడిగాడు మస్తాన్‌రెడ్డి.

''దారికి అడ్డం వచ్చాడని నేనే ఒక దెబ్బ వేశాను'' తడుముకోకుండా సమాధానం తనే యిచ్చాడు పత్తేదార్‌.

''అప్పు తీర్చటానికి ఒక నెలరోజులు గడువు ఈయమని ప్రాధేయపడుతుంటే కొట్టాడు. ఏనుగు లాంటి మనిషి ముందు మావంటి బలహీనులు నిలబడగలరా?'' రెండు అడుగులు ముందుకు వేసి అసలు విషయాన్ని వెల్లడించాడు గుంపులోని ఒకడు.

''రెండు సంవత్సరాలు ఆగినవాళ్ళు ఒక నెలరోజులు ఆగలేరా?'' పత్తేదార్‌ వైపు తిరుగుతూ అడిగాడు మస్తాన్‌రెడ్డి.

''నెలరోజులు కాదు గదా ఇంకొక్కపూట గూడా ఆగేది లేదు. ఇప్పటికిప్పుడు బాకీ చెల్లు చేయకపోతే ఈ పిల్లను పట్టుకెళ్ళటమే''.

ఆ మాటలు అంటున్నప్పుడు పత్తేదార్‌ ముఖంలో ప్రతిఫలించిన కర్కశత్వాన్ని గమనించనట్లు ప్రక్కకు తిరిగి బాజీ తండ్రిని లేపి నిలబెట్టాడు మస్తాన్‌ రెడ్డి.

''ఇంటిని బేరం పెట్టాను. పదిహేనురోజుల్లో సొమ్ము మొత్తం ఇచ్చేస్తామని చెప్పారు. ఆ సొమ్ము చేతికి రాగానే బాకీ చెల్లు చేద్దామని అనుకుంటుండగా ముందుకు వచ్చింది ఈ ప్రమాదం'' గుండెల్ని అదుముకుంటూ అతనితో చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడతను.

''ఇల్లు బేరం పెట్టానంటున్నాడు గదా! ఆ డబ్బు అందగానే మీ బాకీ తీరుస్తాడు'' పత్తేదార్‌ వైపు చూస్తూ అన్నాడు మస్తాన్‌రెడ్డి.

''అదేం కుదరదు. ఇటువంటి గడువులు గతంలో చాలా అయిపోయాయి.''

''గతంలో మస్తాన్‌రెడ్డి మధ్యవర్తిగా రాలేదు. ఇప్పుడు వచ్చాడు. నెలరోజుల్లో ఇతను బాకీ చెల్లించకపోతే మస్తాన్‌రెడ్డి స్వయంగా వచ్చి వడ్డీతో సహా డబ్బు ఇస్తాడని మీ రుస్తుంతో చెప్పు. రాకరాక పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల ఉసురు పోసుకోవటం మంచిది గాదు'' అతని దగ్గరకు పోయి అనునయంగా అన్నాడు మస్తాన్‌ రెడ్డి.

తరువాతేం జరిగిందో తెలుసుకోవాలంటే నేరప్రవృత్తి ఉన్న వ్యక్తుల నేపథ్యాలతో థ్రిల్లర్స్‌ అందించే మధుబాబు రాసిన మరో థ్రిల్లింగ్‌ నవల పులిమడుగు చదవాల్సిందే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good