ఆధునిక విజ్ఞానమనే మహా భవనానికి మూల స్తంభాలలో ఒకరు సిగ్మండ్ ఫ్రాయిడ్. వైద్యశాస్త్రానికి, వైద్య శాస్త్రజ్ఞులకు, మానసిక శాస్త్రజ్ఞులకు, మానసిక శాస్త్రాధ్యాపకులకు, తాత్వికులకు విజ్ఞానప్రదాత.
తన సుదీర్ఘ జీవితంలో అనేక వ్యతిరేక పరిస్థితుల్ని, కష్టాల్ని, దారిద్య్రాన్ని, వాటివల్ల కలిగే నైరాశ్యాన్నీ ఎదుర్కొన్నా, తన అన్వేషణను మాత్రం దీక్షగా కొనసాగించి, మనకు మానసిక విశ్లేషణా పద్ధతి (Psycho Analysis) స్వప్నాల అర్ధాల ఆవిష్కరణ వరాలుగా ఇచ్చిన మహామనీషి సిగ్మండ్ ఫ్రాయిడ్.
ఆయన ఎన్నో విజ్ఞాన గ్రంథాలు, ఇతర వ్యాసాలు తన పరిశోధనల ఆధారంగా రచించడమే గాకుండా, విశేషంగా పర్యటిస్తూ, ఉపన్యాసాలు ఇస్తూ, చర్చాసదస్సులలో పాల్గొంటూ మానవజాతికి మేలుచేసే చైతన్యవంతమైన జీవితం గడిపాడు.
వైద్య శాస్త్రానికి, ప్రత్యేకించి మానసిక విశ్లేషణా పద్ధతికి ఆద్యుడయిన సిగ్మండ్ ఫ్రాయిడ్ జీవితం, కృషి మీద ప్రముఖ వైద్యులు, ప్రఖ్యాత రచయిత డాక్టర్ పరుచూరి రాజారామ్ అందించిన మహోన్నత గ్రంథం, సిగ్మండ్ ఫ్రాయిడ్ జీవితం-కృషి. ''ఆంధ్రప్రభ'' దినపత్రిక ఆదివారం అనుబంధాలలో ధారావాహినిగా ప్రచురింపబడి అశేష పాఠకుల విశేషాభిమానాల్ని చూరగొన్న ఉత్తమ రచన.