ప్రమాదకరమైన శాస్త్రజ్ఞానం
సైకాలజీని ఒక శాస్త్రంగా ఎందుకు భావిస్తారు? ఎవరు భావిస్తారు? దీని ఆవిర్భావం ఎలా జరిగింది? యూనివర్సిటీల్లో దీన్ని అధ్యయనం చెయ్యటం వెనుక వున్న సామాజిక, ఆర్థిక కారణాలు, రాజకీయ వ్యవస్థ, చారిత్రక నేపథ్యం గురించి మనం మాట్లాడుకుందాం. లభ్యమవుతున్న ఆధారాల ప్రకారం, పందొమ్మిదవ శతాబ్ది ఉత్తరార్థంలో సైకాలజీ ఒక శాస్త్రంగా రూపుదిద్దుకున్నది. లైఫ్జింగ్ యూనివర్శిటీలో పనిచేస్తున్న విల్హెం వూంట్ తొలిసారిగా ప్రయోగాత్మక సైకాలజీ లేబరేటరీ ప్రారంభించాడు. అప్పటికి ''మనసు'' గురించి జరిగిన తత్వశాస్త్ర అధ్యయనాలనూ, శారీరక నిర్మాణాన్నీ అనుసంధానించాలన్నది ఆయన ఆశయం. అయితే వూంట్ కృషి ముందుకు సాగలేదు. కాని ఆ విషయం యిక్కడ అప్రస్తుతం.
ఈ 'ప్రయోగాత్మక సైకాలజీ' మూలాలూ ఎన్లైటెన్మెంట్ ఆలోచనా ధోరణిలో వున్నాయి. 17, 18వ శతాబ్దాల నాటి సాంస్కృతికోద్యమం ఎన్‌లైట్‌మెంట్. ఆలోచనల్లో హేతుబద్దతను ప్రవేశపెట్టి తద్వారా సామాజిక మార్పు తీసుకురావాలన్నది ఈ ఉద్యమలక్ష్యం. కేవలం శాస్త్రీయమైన అవగాహన, ప్రయోగ ఫలితాల ఆధారంగానే సైకాలజీని ఒక సైన్స్‌గా గుర్తిస్తున్నారుగాని దీని వెనుక రాజకీయ కారణాలు, అధికారవర్గ ప్రయోజనాలు, ధన ప్రభావం ఏమీ లేవంటారు దీనికి వత్తాసు పలికేవాళ్ళు. అమెరికన్ సైకాలజీ టెక్ట్స్‌బుక్స్ రచయితలు యిదంతా నిజమేనని మనం నమ్మాలంటున్నారు. అయితే అసలు విషయమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పేజీలు : 80