''సాహిత్యానికి ఆధారము జీవితమే. ఈ పునాది మీదే సాహిత్యపు ప్రాకారాలు నిలబెట్టి - వాటి మీద భవనాలు, అంతస్తులు, బురుజులు నిర్మించుచున్నారు. కాని పునాది మాత్రం నేలలోనే అణచివేయబడింది. దానిని అన్వేషించాలంటే మన హృదయం అంగీకరించదు. జీవితం పరమాత్ముని సృష్టి అగుటవలన అనంతంగాను, అబోధంగాను, అగమ్యంగాను వుంటోంది. సాహిత్యం మానవుని సృష్టి అగుటవలన సుగమంగాను, సుబోధంగాను, గౌరవాలకు పరిమితిగాను వుంటోంది. జీవితం పరమాత్మునిపట్ల కృతజ్ఞతతో వుంటుందో లేదో తెలియదుగాని సాహిత్యం మాత్రం మానవునికి కృతజ్ఞతతో వుంటోంది. సాహిత్యం అక్రమం మార్గాలలో సంచరించకుండా చట్టాలు నిలబడివున్నాయి. జీవితానికి ప్రధానోద్దేశము ఆనందమే. మానవుడు జీవిత పర్యంతము యీ ఆనందాన్ని అన్వేషించడంలోనే నిమగ్నమవుతాడ్ణు''.
''ప్రతి దేశం సినిమాలను అభివృద్ధి పరచటం ప్రత్యేక లక్షణంగా పెట్టుకొంది. మానవ జీవితాలను సంస్కరించే యీ సినిమాలను ధనాశకు లోబడేవాళ్ళ చేతులలో వుంచకడదనుకొంది. ప్రజలు ఏ వస్తువులను ఎక్కువగా అభిలషించుతారో ఆ వస్తువులను తయారుచేయటమే పరిశ్రమలు ధ్యేయంగా పెట్టుకొంటాయి. ఒక వేళ ప్రజలకు తాటికల్లు యిష్టమయితే తాటికల్లు దుకాణాలు పెట్టి డబ్బు సంపాదించటానికి యత్నిస్తాయి. దీని వలన మానవుడు దైహికంగా, ఆత్మికంగా, నైతికంగా, ఆర్థికంగా, పారివారకంగా ఎంత దిగజారిపోయినా వాళ్ళు లక్ష్యపెట్టరు. ధనం సంపాదించటమే వాళ్ళ లక్ష్యము.'' - ప్రేమ్చంద్