జనం నుండి జనంలోకి సాహిత్యం - అని నమ్మిన వ్యక్తి వట్టికోట ఆళ్వారుస్వామి. తెలంగాణా జనజీవితాన్నీ, సంస్క ృతీ వారసత్వాన్నీ, భాషా సౌందర్యాన్నీ, తిరుగుబాటు తత్వాన్నీ, పోరాట నేపథ్యాన్నీ తన రచనల్లో నిక్షిప్తీకరించాడు. జనం పలుకుబళ్ళనూ, మాట్లాడేతీరు తీయాలనూ సమర్ధవంతంగా తన రచనలను సింగారించాడు. యాసల, జాతీయాల సొగసులద్దాడు. తెలంగాణాలో తొలి నవలా రచయితగా మన్ననలందాడు. ఢిల్లీ కోటలో గుండె ఝల్లుమనిపించిన నల్లగొండలో 1915లో అతి నిరుపేద కుటుంబంలో జన్మించిన పోరుబిడ్డ ఆళ్వార్. పుట్టుక నుండి పేదరికంతో పోరాడ్డం నేర్చి, చదువుకు దూరమై బతుకుతెరువుకు విజయవాడలో ¬టల్ కార్మికుడిగా పనిచేసి, శ్రామికవర్గంతో ఎదిగిన ఆళ్వార్ స్వామి; గ్రంథాలయ ఉద్యమంలోనూ, తెలంగాణా రచయితల ఉద్యమంలోనూ, దేశోద్ధారక గ్రంధమాల వ్యవస్థాపకుడుగానూ అంచెలంచెలుగా ప్రజోద్యమాల్లో నాయకత్వ స్థాయికొచ్చాడు. ఆంధ్ర మహాసభ, తద్వారా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో ఒకచేత పెన్నూ, మరోచేత గన్నూ పట్టి ప్రజల కోసం పోరాడిన వ్యక్తి. క్విట్ ఇండియా ఉద్యమం నుండి నిజాం వ్యతిరేక పోరాటాల వరకూ నాలుగైదు సంవత్సరాలు కారాగారవాస శిక్ష అనుభవించాడు. జైళ్ళలో ఉన్న ఖైదీల కోసం జైళ్ల సంస్కరణల కోసం పోరాడాడు. ''జైలు లోపల'' కథల సంపుటిలో ఖైదీల విభిన్న మనస్తత్వాలను ఆళ్వార్ చక్కగా వర్ణించాడు. 1938కి ముందు నిజాం పాలన కింద తెలంగాణాను ''ప్రజల మనిషి'' నవలలో చిత్రీకరిస్తే, 1940-45ల మధ్య సాయుధ పోరాటానికి పురిటి నొప్పులు పడ్తున్న తెలంగాణాకు 'గంగు' నవల అద్దంపడ్తుంది. 'రామప్ప రభస' వ్యాసాలు సామాజిక సమస్యలను వ్యంగ్యంగా, ప్రతిభావంతంగా కళ్ళెదుట నిల్పుతాయి |