ప్రమాదాలు వాటంతటవే జరగవు. మన అజాగ్రత్త, పొరపాట్లు, నిర్లక్ష్యంవల్లే ఎక్కువగా జరుగుతాయి. జబ్బులు కూడా అంతే! మన అజాగ్రత్త, అశుభ్రత, దురలవాట్లు, అజ్ఞానం కారణాలవల్లే జబ్బులు వస్తాయి. ప్రమాదం సంభవించినా, ఉన్నట్లుండి జబ్బు చేసినా ప్రథమ చికిత్స వెంటనే చేస్తే బాధ తగ్గుతుంది. దుష్ఫలితాలు తగ్గుతాయి. ప్రాణం నిలబడుతుంది. తర్వాత డాక్టరు చేసే చికిత్సకు రోగి త్వరగా కోలుకునేందుకు ఉపయోగపడుతుంది. ప్రమాదాలు, జబ్బులు ఒక్కోసారి ఉట్టిపాటునే వస్తాయి. వచ్చినపుడు, వచ్చిన చోటనే వెంటనే ప్రథమ చికిత్స జరగాలి. సమయం ఏమాత్రం వృధాకాకూడదు. ప్రతిఒక్కరూ ప్రథమ చికిత్స చేయడం నేర్చుకోవడం మంచిది.
ఇంట్లో, వీథిలో, పొలంలో, ఫ్యాక్టరీలో, కార్యాలయంలో, రోడ్డుమీద, మనచుట్టూవున్న ఏ చోటైనా ప్రమాదాలు సంభవించేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా - వరదలు, తుపానులు, భూకంపాలు, రైలు, విమాన ప్రమాదాలు, యుద్ధాలు - ఇలా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అందుకే అందరూ ప్రథమ చికిత్సలో శిక్షణ పొందడం అవసరం. పోలీసు, అగ్నిమాపకదళం డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు మొదలగువాళ్ళకు మాత్రమే ప్రథమ చికిత్స ప్రత్యేకాంశంగా నేర్పినా, అందరూ ఇది తప్పక నేర్చుకోవాలి. తమకుతాము చేసుకోవడానికి, ఇతరులకు చేయడానికి ప్రతి ఒక్కరికి ప్రథమ చికిత్స అవసరమే. సామాజిక బాధ్యతగా ప్రతి పౌరుడికి తప్పని విధి!
ప్రతి ఒక్కరు ప్రథమ చికిత్స నేర్చుకోవటం వల్ల బాధలను పోగొట్టి ప్రాణాలను నిలబెట్టవచ్చు.
Pages : 95