ఆత్మను, పరలోకాన్ని కొందరు మోసగాళ్ళు సృష్టించి, ఆ పరలోకం చేరడానికి వారధులం తామేనని ప్రచారం చేసుకుంటున్న ప్రాచీన కాలంలోనే వారి వాదనను శక్తివంతంగా ఖండించి, భౌతికవాదాన్ని ప్రతిపాదించినవారే చార్వాకులు, లోకాయతులు. పరలోకవాదం లేక భావవాదాన్ని ఆనాటి రాజుల అండదండలతో పురోహితవర్గం ప్రతిపాదించి, యజ్ఞయాగాది క్రతువుల ద్వారా పరలోక సుఖాలందుతాయని ఊదరగొట్టి ప్రజల్ని అంధ విశ్వాసాల్లో ముంచెత్తడానికి ప్రయత్నించారు. దానికి వ్యతిరేకంగా స్వార్థరహితులైన కొందరు పండితులూ, సామాన్య ప్రజల్లోంచీ, బానిసల్లోంచీ వచ్చిన మేథావులూ భావవాదంలోని డొల్లతనాన్ని బయటపెట్టి, భౌతికవాదాన్ని ప్రతిపాదించి తమ చారు వాక్కులతో (ఆకర్షణీయమైన వాక్యములతో) ప్రజలను విశేషంగా ఆకర్షించగలిగారు. ఉదాహరణకు యజ్ఞాలలో పశువులను వధించడాన్ని హేళన చేస్తూ, చార్వాకులు ''యజ్ఞంలో వధించబడే పశువులు, చచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్ళడమే నిజమైతే యజ్ఞం చేసే యజమానులు, ఆ యాగాల్లో తమ తండ్రుల్నే చంపి, సరాసరి స్వర్గానికి ఎందుకు పంపరు?'' అని ప్రశ్నించారు. హేళనలతోను, విమర్శలతోను సరిపుచ్చక నేల, నీరు, నిప్పు, గాలి అనే చతుర్భూతముల వలననే చైతన్యశక్తి ఉద్భవిస్తుందనీ, ఇంతకి మినహా ప్రాణి శరీరంలో ఆత్మ అనేది వేరే లేదని, ప్రతిపాదించారు. ఇది సహజంగా పాలకవర్గాలకూ, పరాన్నభుక్కులైన పురోహిత వర్గానికీ కోపకారణమైంది. వారు చార్వాకులనూ, లోకాయుతులను వెంటాడి, వేటాడి చంపారు. వారి రచనలను సమూలంగా నాశనం చేశారు. దానికి సంబంధించిన ఏకైక రుజువు కౌటిల్యుని అర్థశాస్త్రం. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో చార్వాకులను నాస్తికులని తిట్టిపోశాడు. ''రాజు నాస్తికులను విషం త్రాగించి చంపించవచ్చు.'' విచిత్రమేమిటంటే ఇలా చెప్పిన కౌటిల్యుడు ''రాజుకు వ్యక్తిగతంగా ఎలాంటి మూఢనమ్మకాలు ఉండకూడదు.'' అంటాడు. ఇలా పాలకవర్గాలకు ఎదురీదిన ప్రాచీన కాలపు భౌతికవాదుల సంగ్రహ పరిచయమే యీ పుస్తకం. |