ఈ పుస్తకము పెరియవాతో 40 ఏళ్ల అనుబంధం తర్వాత వ్రాసాను. అందువల్ల చాలా విషయాలు గతించిన కాలంలోనివి. ఆయనతో చేసిన సంభాషణలు మరచిపోయాను. ఒక పుస్తకము తీసుకుని ఒక్కొక్కటిగా వ్రాస్తూ దీన్ని ప్రచురించాము కొంచెం పెద్ద పుస్తకముగా....
ఈ పుస్తకము చదువుతుంటే కంచిస్వాములకి చాలా దగ్గరగా ఉన్న అనుభూతి కలిగిందని పుస్తకం చదివిన వారు మెచ్చుకున్నారు....
శ్రీశైలంలో ఆకర్షణ శక్తితో దీక్ష
1. ఏం జరుగుతోంది ఇక్కడ?
అది 1957వ సంవత్సరము నాకు 21 సం||ల వయస్సు. నేను కుంభకోణములో గవర్నమెంటు కాలేజీలో నా విద్య పూర్తి చేసుకుని చెన్నై వెళ్ళాను. మద్రాసు వెస్ట్మాంబళంలో ఉన్న అంజుగము స్కూలులో గణితానికి విరామ ఉపాధ్యాయుడిగా చేరాను. (తరువాత ఆంధ్రప్రదేశ్లో స్థిరమైన అకౌంటెంట్ జనరల్ ఉద్యోగము దొరికినది)
నేను టీనగర్, పాండీ బజార్, దీనదయాలు వీథిలో విడిగా ఒక రూములో ఉండేవాడిని. వెస్ట్మాంభళం అంజుగం స్కూలుకి వెళ్లాలంటే ఎన్నో వీథులు టి.నగర్ మరియు వెస్ట్మాంబళము రహదారి మార్గాన దాటి వచ్చేవాడిని.
ఒక రోజు నేను పాఠశాలకు వెడుతుంటే టి.నగర్లో ఓ ఇంటి వద్ద మామిడి తోరణాలతో అరటిచెట్లతో పెద్ద పందిరి వేసి, సాంప్రదాయ బద్ధంగా అలంకారం చేస్తున్నారు. పంచకట్టుకుని కండువాపైన వేసుకుని నుదుట విభూతి రేఖలతో మగవాళ్లు, సిల్కుచీరలు కచ్చాపోసి కట్టుకుని వజ్రపు దుద్దలు పెట్టుకుని చిన్నచిన్న గుంపులుగా చేరి చిన్న గొంతులతో స్త్రీలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అక్కడ పెళ్లిసందడిగాని, వేరే ఇంకొక ఉత్సవముగాని జరుగుతున్నట్లు లేదు. ఉత్సుకతతో అక్కడ వున్న ఒక పెద్ద మనిషిని ఇక్కడ ఏమి జరుగుతోంది అని అడిగాను.
ఒక వారము రోజులు పరమపూజ్యులు కంచి మహాస్వామి ఇక్కడ బసచేయడానికి వస్తున్నారు అని తెలిసింది. మహాస్వామి వచ్చారు. లోపలికి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలని అనిపించలేదు. మహాస్వామి సాక్షాత్ ఈశ్వరుడు అని అంతకుముందు తెలియకపోవడము ఒక కారణమవచ్చునేమో!....