కాటమరాజు కథలను, పలనాటి కథలను, ఇతర వీరగాథలను సేకరించ బూనుకోవడమే ''హెర్క్యూలియన్‌ లేబర్‌' లాంటి గొప్ప శ్రమ. ఓపికకూ, కష్ట సహిష్ణుతకూ కఠిన పరీక్షలాంటి ఈ గాథాసేకరణను ఔత్సాహికులైతే, ఇతర వ్యాసంగాలూ వ్యాపకాలూ లేనివారైతే, చేయగలగినంత తీరికగా, ఉల్లాసంగా, 'అకాడెమిక్‌' పరిశోధకులు చేయలేరని భావించడం సవ్యంకాదని తంగిరాల వేంకట సుబ్బారావు నిరూపించారు.

ఒక జాతి సంస్కృతిలో జానపద సంస్కృతి ప్రధానమైన భాగం. దీనిని అద్యయనం చేయకుండా ఆ జాతి సంస్కృతిని పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. వేగంగా అభివృద్ధి చెందుతున్న నాగరికతతోపాటు, జానపద సాహిత్యం కూడా అంతరించిపోతోంది. (ఇప్పటికే చాలా భాగం అంతరించిపోయింది.) దానిని పరిరక్షించుకోవలసిన బాధ్యత మనమీద ఉన్నది.

'బెర్‌ట్రాండ్‌ రస్సెల్‌' భావించినట్లుగా ప్రపంచమంతా ఒకే దేవంగా ఉంటే ఫరవాలేదు. కాని అలా లేదు కదా! కాబట్టి, వివిధ విభిన్న దేశాలు ఉన్నంతకాలం యుద్ధాలు వస్తాయి. యుద్ధ సమయంలో యువకులు ఉత్సాహంగా సైన్యంలో చేరి దేశాన్ని రక్షించుకోవాలి. వీరగాథాగానం యువకులలో యుద్ధోత్సాహాన్ని నింపుతుంది. అందువల్ల నాయకులు వీరులను గురించి, వీరగాథలనుగురించి తెలుసుకోవాలి. వీరగాథాగానం, బుఱ్ఱకథాగానం ప్రజలను నిత్యచైతన్యశీలురుగా మలచుతాయి. వీరగాథలవల్ల ఇది ఒక ముఖ్యమైన ప్రయోజనం.

అయితే, వీరగాథలలోని ''పేరంటాండ్ర కథలు'' మాత్రం ఆధునిక యువతులకు, స్త్రీలకు ఏ విధంగానూ ఉపయోగపడవు. కాని ఒకప్పుడు స్త్రీలు ఎంత అధోగతిలో ఉండేవారో, పాతివ్రత్యం విషయంలో వారి ఆలోచనలు ఎంత మూర్ఖంగా ఉండేవో, వారు కుటుంబ హింసలకు ఎలా బలి అయ్యేవారో తెలుసుకునేందుకు మాత్రం ఈ పేరంటాండ్ర కథలు ఉపయోగపడతాయి. ఇవి వ్యతిరేక సందేశాన్ని ఇస్తాయి. అంటే స్త్రీలు ఎలా ఉండకూడదో అనే విషయాన్ని తెలియజేస్తాయి. ''వెనుక చూచిన నేమి ఫలమోయ్‌ - మంచి గతమున కొంచెమేనోయ్‌'' అనే మహాకవి గురజాడ మాటలు ఈ పేరంటాండ్ర కథలకు, గ్రామకక్షలకు - హత్యలకు సంబంధించిన వీరగాథలకు, వీరగాథానికలకు, బాగా వర్తిస్తాయి. మహాభారతంలోని ''మాద్రి'' నుండి, నిన్నమొన్నటి రాజస్థానీ యువతి ''రూప్‌ కన్వర్‌'' వరకూ జరిగిన సహగమనాలను తలచుకుంటే సిగ్గుతో మన తలలు పాతాళం వరకూ దించుకోవాల్సి వస్తుంది! (ప్రాచీన కాలంలోను, మధ్యయుగాలలోను స్త్రీలు సంపదలో ఒక భాగం. శత్రువులు ఒక రాజ్యాన్ని జయించినప్పుడు అక్కడి సంపదతోపాటు స్త్రీలను కూడా ఎత్తుకుపోయేవారు. ఆ అవమానం తప్పించుకుందుకు సహగమనాలు చేసేవారని భావించవచ్చును.)

పేజీలు : 876

Write a review

Note: HTML is not translated!
Bad           Good