పొడుపు కథ ఏవో కొన్ని ఆధారాలు సమకూర్చి ఆలోచింపచేస్తుంది. తన జ్ఞానాన్ని, అనుభవాన్ని, ఈ ఆధారాలతో సమన్వయించుకుంటూ, జవాబును అన్వేషించేందుకు పురికొల్పుతుంది. కిటుకును ఛేదించి స్ఫురిస్తున్న విభిన్న సమాధానాల్లో దోష సవరణ పద్ధతి ద్వారా సరియైన దాన్ని ఎంపిక చేసుకోవాలి. పొడుపు కథ పరి పరి విధాల ఆలోచింపచేసి, బుద్ధికి పదును పెడుతుంది.

    ప్రస్తుతం పొడుపు కథ క్విజ్‌, పజిల్స్‌, అవధాన విషయాలవంటి రూపాల్లో ప్రచారంలో ఉంది. విద్యారంగంలో బహుళ వ్యాప్తిగల క్విజ్‌ కేవలం జ్ఞాపకానికే కొలమానం తప్ప ఆలోచనతో కాని, జ్ఞానంతో కాని దానికి పనిలేదు. అయితే క్విజ్‌ కొన్ని సందర్భాల్లో బహుసంవరణీయ ప్రశ్న రూపంలో కూడా నిర్వహిస్తున్నారు. ఇది కొంత నయం, ఆలోచనకు ఆస్కారం ఉంటుంది.

    ఇక పజిల్స్‌ అనేది ఎన్నో రకాలుగా విస్తరించి ఉంది. భాషా, సాహిత్యాల పరంగా పత్రికల్లో పజిల్స్‌ తరచుగా కానవస్తున్నాయి. ఇక గణిత ప్రధానమైన పజిల్స్‌ ఎంతో ఉన్నతస్థాయికి చెందినవి. విద్యావంతుల్లో విశేష ప్రచారం పొంది, బండెడు సాహిత్యం సంతరించుకున్న ప్రక్రియ ఇది. 

    పొడుపు కథలకు ఆలోచన, ఓపిక, అన్వేషణ కావాలి. ఇవన్నీ మానవ జీవితంలో విజయ సోపానాలుగా ఉపకరించే లక్షణాలే. పొడుపులో ఎక్కడో ఒక కిటుకు ఉంటుంది. తెలివిగా విషయాన్ని మరుగుపరచి, బుద్ధిని సవాలు చేస్తుంది.

    గ్రామీణులు తీరిక వేళల్లో పోటీలు పడుతూ, పొడుపులు - విడుపులతో వినోదిస్తుండేవాళ్లు. కథలు విప్పుతుంటే మహదానందం అనుభవించేవాళ్లు. మెదడుకు మేతగా చురుకు పుట్టించేవి. ఈ గ్రామీణులే తొలినాటి పొడుపు కథల నిర్మాతలు.

ఈ పుస్తకంలో పొడుపు కథలు కొన్ని యధాతథంగాను, కొన్ని మార్పులు చేర్పులతోను సేకరించినవి.

ఈ రచన 6 నుండి 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్న పిల్లల స్థాయికి సరిపడి ఉపకరిస్తుంది. వినోదం, విజ్ఞానంతోపాటు, పిల్లల భాషాభివృద్ధికి కూడ ఈ ప్రయత్నం సహాయకారి కాగలదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good