'చిన్నపిల్లలు పది పుస్తకాలు చదివితే రాని విజ్ఞానం ఒక మంచి నాటకం చూస్తే వస్తుంది!' పిల్లల మనసుల మీద దృశ్యం గాఢంగా హత్తుకుంటుంది. పిల్లలకు మానవీయ విలువలు గురించి, నడవడిక గురించి, మంచి చెడుల విచక్షణ, జీవితాదర్శాల గురించిన ఎన్నో విశేషాలను వినోదాత్మకంగా బోధించవచ్చు.
తెలుగులో స్వతంత్రనాటికా రచనకు పిల్లల నాటికలతోనే శ్రీకారం చుట్టబడింది. తెలుగునాట ప్రదర్శనా విషయంగా కూడా విద్యార్థులే తొలి ప్రదర్శకులుగా చరిత్ర సృష్టించారు.
పిల్లల మనసులకి ఆనందం, ఆహ్లాదం కలిగించటంతో పాటు వారిలోని సృజనాత్మకశక్తికి పదును పెట్టేవి, ఊహలకు రెక్కలు తొడిగేవి, మానసిక వికాసానికి దోహదపడేవి బాలలనాటికలు.
సుమారు వందేళ్ళ కాలంలో జరిగిన సామాజిక ఫరిణామాలతో పాటు, పిల్లల విషయంలో కాలానుగుణంగా మారుతూ వచ్చిన పెద్దల ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనా ధోరణులను ప్రతిబింబించేలా ఈ సంకలనాన్ని సంకలనకర్తలు తీర్చిదిద్దారు.
సంకలనకర్త వల్లూరు శివప్రసాద్ తన, తెలుగు నాటకరంగ పతాకాన్ని సమున్నతంగా ఎగరేస్తున్న మూడవతరం నాటక రచయిత. నటుడుగా, దర్శకుడుగా నాటకరంగంలోతన ప్రత్యేకత చాటిన గంగోత్రిసాయి ఈ సంకలనానికి ఉపసంపాదకుడు. వీరిద్దరూ గతంలో ప్రసిద్ధ తెలుగు నాటికలు, ప్రసిద్ధ తెలుగు హాస్య నాటికలు, బడి గంటలు పిల్లల నాటికల సంకలనం, ప్రసిద్ధ తెలుగు నాటక పద్యాలు, నాటకరంగ ప్రముఖులు మొదలగు అమూల్యమైన గ్రంథాలను నాటకరంగానికి అందించారు.
బాలసాహిత్యంలో నాటకరచనపట్ల ఆసక్తిని, విభిన్న అంశాలపట్ల అవగాహనకు, అధ్యయనానికి, మరింత మెరుగులు దిద్దుకోటానికి తోడ్పాటునందించే విశిష్టసంకలనం 'ప్రసిద్ధ బాలల నాటికలు''.
Pages :379