ఆధునిక కళ ఏమీ అర్థం కావడం లేదు. ఇక్కడో చేయి, అక్కడో కాలు, మూడు కాళ్లూ, విసరి వేసినట్లు, ఉంటున్నాయి. ఒక కొలను, కొలనులో తేలియాడే సిగరెట్లు-ఇలా ఒకదానికి మరోదానికి అంతన పొంతన లేని చిత్రాలు. ముఖాన్ని అంతా మింగివేసే ముక్కు, అరికాలులో కన్ను, కదాకారా కృతులతో గూడిన చిత్రాలు, మోనాలిసాకు మీసాలు పెట్టిన డాడాయిస్టు చిత్రాలు. వీటిని చూసిన ఆధునిక సీదాసాదా మనిషి తనకంతా అయోమయంగా ఉందని గోల పెడుతున్నాడు. అతడు ఎంతగా గోలపెడితే అంతగా తానూ ఆ కళాకారుడు గీస్తున్న చిత్రాలలో భాగమై ఉన్నాడన్న మాట. ఆ చిత్రాలు అతనినే చిత్రిస్తున్నాయన్న మాట... ఆధునిక శిల్పం పూర్తిగా రంద్రాలు, ఖాళీలు ఉన్న దాగుడు మూతలు ఆడే మానవ దేహాలను ప్రదర్శిస్తోంది. అంటే ఏతావాతా తేలింది ఏమంటే శూన్యత అనేది ఆధునిక కళా, సాహిత్యాలకు ముఖ్య విషయం అవుతున్నది .... జేంస్ జాయిస్ అంతేవాసి అయిన శామ్యూల్ బెకెట్ రాసిన "Waiting for Godot" లో ప్రతి పంక్తిలోను శూన్యం ప్రవహిస్తూ ఉంటుంది.... వాన్‌గో చిత్రించిన తారా రేయి చిత్రాన్ని చూస్తే, ఉపరితలం దాటి లోతుకు చూడడమంటే ఏమిటో అర్థం అవుతుంది... ఫ్రాంట్జ్ కాఫ్కా కొందరి దృష్టిలో, అస్తిత్వవాద రచయితగా డస్టవిస్కీ కంటె గొప్పవాడు. ఒక ప్రక్క, అన్వేషించి, అర్థంచేసుకోమని ఎరవేసే ప్రపంచం, మరోప్రక్క, ఎప్పటికీ స్పష్టంగా అర్థం కానీయని ప్రపంచం-ఈ రెండింటి మధ్య మనిషి పడే గందరగోళం, దిగ్ర్భమల గురించి కాఫ్కా రాశాడు ... హేతువాదం ద్వారా అన్నీ పరిష్కరించవచ్చు ననుకొన్న ఒక కాలం ఉంది. 'ప్రగతి అనివార్యం' అనుకొన్న కాలం ఉంది. ముందు ముందు అంతా మంచే జరుగుతుందని భావించబడిన కాలం ఉంది. కాని కాలం గడిచే కొలది, రెండు ప్రపంచ సంగ్రామాలు ప్రగతిని భ్రమ అని తేల్చడంతో లోలకం పూర్తిగా రెండవ కొసకు పోయింది. ఫలితమే అస్తిత్వవాద ఆవిర్భావం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good