సుందరయ్య వ్యక్తిత్వంపైన పరిపూర్ణ విశ్వాసం ఉన్న కారణంగానే ఆయన మాట విని గెరిల్లా యోధులు ఆయుధాలు దించారు. సాయుధపోరాటాన్ని విరమించారు. 18 మంది పోరాట యోధులకు ఉరిశిక్ష పడినప్పుడు ఇంగ్లండ్ నుంచి డిఎస్ ప్రటి అనే న్యాయవాదిని పిలిపించడం, పోరాటం విరమించిన వారిపైన కేసులు ఉపసంహరించుకోవాలని అడిగేందుకు నెహ్రూనీ, రాధాకృష్ణన్నీ, నాటి హోంమంత్రి గోపాలస్వామి అయ్యంగార్నీ ఒకటికి రెండు సార్లు కలిసి సమాలోచనలు జరపడం సుందరయ్యకు సహచరుల పట్ల ఉన్న సంఘీభావానికీ, సానుభూతికీ నిదర్శనం. సైద్ధాంతిక పోరాటాలలో నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవలసిన సందర్భాలలో సుందరయ్య ఎప్పుడూ మీనమేషాలు లెక్కించలేదు. తన విశ్లేషణ, అవగాహన ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చేవారు. దానికి కట్టుబడి ఉండేవారు.
రాజ్యసభ సభ్యుడుగా పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడి హోదాలో పని చేసినా, శాసనసభలో ప్రతిపక్ష నేత పాత్ర పోషించినా సుందరయ్య అధ్యయనానికీ, వస్తునిష్టకీ, ధర్మానికీ కట్టుబడిన నాయకుడని పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి సంజీవరెడ్డి కానీ, గోపాలస్వామి అయ్యంగార్ వంటి కేంద్రమంత్రులు కానీ, సుందరయ్య నిజాయితీనీ, ఖచ్చితత్వాన్నీ ఎన్నడూ శంకించలేదు. ఆయన దగ్గర సమాచారం స్వీకరించి దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. - కొండుభట్ల రామచంద్రమూర్తి
సుందరయ్య గారు ఒక జీవన విధానం. ఒక సంస్కృతిని నిర్మించి ఇచ్చారు. అందరిలాగా కాకుండా చాలా మందికి భిన్నంగా మనకు కావలసిన జీవిత విధానాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. కోరినట్టు బ్రతికే అవకాశాలున్నాయి. ఏది కోరదగినదో, ఏది తగనిదో విచక్షణ కావాలి.
జీవితం పెట్టే ఆర్థిక వత్తిళ్ళకు లొంగకూడదు. ఆస్తులకు, ఆడంబరాలకు తలవంచకూడదు. నువ్వెలా జీవిస్తున్నావో స్పష్టపరచు. తేటతెల్లంచెయ్. వినేవాళ్లు, కనేవాళ్లు ఆచరించేవాళ్లు వస్తున్నారు.
మనకు తెలియనంత దగ్గరగా మనల్ని గమనిస్తున్నారు. గమనించటమే జీవితం.
గమనాన్ని, గమ్యాన్నీ సరైన దిశగా మార్చుకుంటూ పోవడమే...
సుందరయ్య నుండి నేను పొందింది ఇదే...
ఎవరైనా పొందవలసిన చైతన్యం ఇదే.... ముమ్మాటికీ ఇదే...
పేజీలు : 144