అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది :
నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ గతంలో హైదరాబాద్ అభివృద్ధి పైనే కేంద్రీకరరించడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయని, తాను కూడా కొంతమేరకు పొరపాటు చేశానని, గతంలో వలే కాక 13 జిల్లాలలోను అభివృద్ధిని వికేంద్రీకరించి, నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలందరి సుఖసంతోషాలకు సౌభాగ్యానికి కృషిచేస్తానని హామీ యిచ్చారు. శ్రీకాకుళం జిల్లా నుండి అనంతపురం జిల్లా వరకు ఏయే జిల్లాలో ఏయే అభివృద్ధి పనులను తన ప్రభుత్వం చేపట్టనుందో సుదీర్ఘమైన జాబితా కూడా ప్రకటించారు. కానీ ఆ విషయాన్ని ఆయన మరచిపోయి అమరావతి, పోలవరం తన రెండు కళ్ళు అని పదేపదే ప్రకటిస్తూ వచ్చారు. నూతన ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఆదాయం, కేంద్రం నుండి వచ్చు నిధులు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవలసిన పథకాలు, అభివృద్ధి పనులు మరియు కొనసాగుతున్న ఇరిగేషన్ పథకాలను సత్వరమే పూర్తిచేయటం మున్నగు వాటిపైన లోతుగా అధ్యయనం చేసి సరైన నిర్ణయాలు తీసుకోకవలసి వుంటుంది. అందుకు భిన్నంగా ఆయన వ్యవహరించారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చాలా పెద్దదిగా, చాలా గొప్పదిగా వుంటే పెట్టుబడులు ఆకర్షించబడతాయి అనేది ఆయన భావన. ఒక ప్రాంతంలో లభ్యమయ్యే ముడి వస్తువులు, భౌతిక వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మున్నగు అంశాలను దృష్టిలో పెట్టుకుని నూతన పరిశ్రమలు ఏర్పాటవుతాయేతప్ప రాజధాని నగరం పెద్దదిగా వుంటే అక్కడికే పరిశ్రమలు వస్తాయనే భావన సరికాదు.
పేజీలు : 72