పెళ్ళంటే సందడి; పెళ్ళంటే సంతోషం. ఒక మగవాడు ఒక ఆడది (ముఖ్యమయినవాళ్ళు) కొంత తంతు, కొంత వేడుక, కొంత విచారం... పెళ్ళంటే తెలియని వాడెవ్వడు?

    అయినా, పెళ్ళి సంగతి తెలిసినవారు చాల తక్కువ అని అంటే సాహసంలాగ కనబడుతుంది. సృష్టి ఆరంభం దగ్గర నుంచి ఇప్పటికి ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయో--దేవతల పెళ్ళిళ్ళ సంగతి వదలిపెట్టినా-కొన్ని కోటానుకోట్లు జరిగుండాలి. ప్రతిరోజూ-ఇప్పటికీ వందలూ వేలూ పెళ్ళిళ్ళు ప్రపంచం అంతటా జరుగుతున్నాయి. పెళ్ళిళ్ళు చేసుకొని జీవిస్తున్నవారు ఉండనే ఉన్నారు. పెళ్ళి చేసుకొని వియోగంలో పడ్డవారు మళ్ళీ పెళ్ళిళ్ళకు తలపడుతున్నారు. పెళ్ళికాని వాళ్ళు పెళ్ళిళ్ళ కోసం తొందరపడుతున్నారు. అందుకూ చాలనివాళ్ళు బొమ్మల పెళ్ళిళ్ళతో తరిఫీదవుతున్నారు. చూడగా చూడగా ప్రపంచం అంతా పెళ్ళి కోసమే బతుకుతున్నట్లు కనిపిస్తుంది. అలాంటప్పుడు పెళ్ళంటే తెలిసినవాళ్ళు చాల తక్కువంటే సాహసం కాదా?

    అవును. ఆ సాహసం కావాలి. అలా సాహసించి అడిగేవారు ఉండాలి. అడుగుతేనేగాని, అసలు సంగతి బయటపడదు. అడగడం అజ్ఞాన లక్షణం అన్న రోజులు పోయాయి. అటూ ఇటూ తొణకకుండా ఉంటే అంతా తెలిసిన మహామహుడు అని అనుకునే దినాలు గడిచిపోయాయి. అడిగినవాడే జ్ఞానానికి ఆదరువు. చెప్పగలిగినవాడే గొప్పవాడు. తిక్కన గొప్పతనం అంతా విగ్రహపుష్టే.

    అలా అడగడానికే పూనుకుంటే ప్రశ్నలు శరపరంపరలు. దీనిని పెళ్ళి అని ఎందుకన్నారు? పెళ్ళంటే ఏమిటి? ఎందుకు ఆ పెళ్ళి చేసుకోవాలి? పెళ్ళంటూ ఒకటి లేకపోతే కాదా? దానికిన్ని లాంఛనాలూ; ఆచారాలూ ఎందుకొచ్చాయి?...ఇలాగ వందలూ వేలూ అడగవచ్చును. వీటిలో అనుభవంమీద చెప్పవలసినవి కొన్ని; ఆలోచనచేసి విప్పవలసినవి కొన్ని; శాస్త్రాలు చూడవలసినవి కొన్ని; చరిత్రలు తడవవలసినవి కొన్ని, అంతా బీరకాయపీచు. అంతేగాని సులభంగా తేలేది ఏదీ కనబడదు.

దీనికి పెళ్ళి అన్న పేరెందుకు వచ్చింది - కాకపోతే వివాహం, పరిణయం, కల్యాణం ఏదయినాసరే - అన్న ప్రశ్న శబ్దశాస్త్రజ్ఞులు చెప్పవలసింది - చెప్పుతారు గూడాను; అతికినా అతకకపోయినా ''కుంతీపుత్రో వినాయక:'' అని. ఆ వ్యుత్పత్తులూ వాటి సంగతీ, ముందు ముందు మనమూ చూద్దాం.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good