నేను తెలుగులో రచన ప్రారంభించిన కొత్తలో చిన్న చిన్న కథలు రాశాను. ఒక సాయంత్రం శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రిగారు చూడవచ్చి 'ఈ గాజులు తొడిగించుకునే కథలు ఎన్ని రాసినా ఒకటే. ఇవి తగ్గించి కొత్త పంథా తొక్కితే బాగుంటుందేమో ఆలోచించు'' అన్నారు. మల్లాదివారు పత్రికలలో అచ్చయ్యే కథలన్నీ చదివేవారు. సీరియల్స్‌ కూడ చదివేవారు! చర్చించేవారు!! ''నేను కొత్తగా రాశాననుకొన్నది - ఇంకొకరిలా రాశానని అనరా!'' అని అడిగాను. నా ఉద్దేశ్యం కాంతం కథల్లా యింకోవిధంగా నో అనరా అని. నీ తరం వేరు, ప్రయత్నించు అన్నారు. అప్పుడే నేను తొలిసారిగా పార్వతీ కృష్ణమూర్తిల పాత్రలని అనుకున్నాను. ఈతరం చదువుకున్న పిల్లల మనస్తత్వాలూ, సరదాలూ, కోపతాపాలూ, ప్రేమలూ, ప్రణయ కలహాలూ, పెళ్లి, అసూయలు, పిల్లల పెంపకంలో - ఇద్దరి బాధ్యతలూ ఇలా చిన్న కథలూ, స్కెచెస్‌ రాయడం ప్రారంభించాను. అవి రెండు మూడు చదివాక - ''ఇప్పుడు నువ్వు దారి కనిపెట్టావు. ఇవి రాయి. చూడముచ్చటైన జంట కావడమే కాదు. కుర్రపఠితల మనసుని తాకుతారు'' అని ఆశీర్వదించారు. నేను వారికి కృతజ్ఞురాలినే కాదు, రుణపడివున్నాను. నాకీ మార్పుని సూచించి వుండకపోతే ప్రేమలు, పెళ్లిళ్లు, ఆత్మహత్యలు, లేచిపోవడలు, పగిలిన హృదయాలు అంటూ రాస్తూ ఉండేదాన్నేమో. ఒక వ్యక్తిత్వం గల పాత్ర పార్వతిది. ఆవేశం, ఆవేదన, అనురాగం, ఆనందం - అన్నీ ఎక్కువే. నాకు ఇష్టం.
ఇక నా రచనా వ్యాసంగం కూడ ముగింపు దశకు చేరుతోంది. ఈ పాత్రలతో కథలే రాశాను గానీ చిన్నదైనా నవల రాయలేదు. అందుకే యీ ''పెళ్ళి'' రాశాను. ఇది 'స్వప్న' మాసపత్రికలో సీరియల్‌ అయింది. చదువరులు ఆనందం, ఆవేదనా కూడ వ్యక్తపరిచారు. కాని - యీ జీవితానికి ముగింపు తప్పదు. అలాంటి సమయంలో బాధ్యతలు వుండిపోతే - మిగిలిపోయినవారు పూర్తిచేయక తప్పదు కదా! ఆడదానికి - కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం వున్నట్టు మగవాళ్లకి వుండదనుకుంటాను. అందుకే - పార్వతిని మిగిల్చాను... ఆమె ప్రేమతో అంతులేని భారం, ఆనందంగా మోసింది కదా! అది చెప్పాలని.
ఎప్పటిలాగే నాకు చాలా యిష్టమైన ఈ నవలకి ముఖచిత్రం బాపుగారు వేశారు. దీనికి వేసిన రెండు చిత్రాలు ప్రేమ నాణెం రెండు ముఖాలనూ చూపిస్తున్నాయి. ఈ కథకి వ్యాఖ్యానంలా వుంటాయి యీ చిత్రాలు. నా ఈ నవలను పఠితలు చదివి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. - కె. రామలక్ష్మి

Write a review

Note: HTML is not translated!
Bad           Good