పెద్దిభొట్ల సాంఘీకంగా అగ్రకులజీవి. వర్గపరంగా మధ్యతరగతికి చెందినవారు. భావజాలపరంగా అభ్యుదయవాది. జీవితాన్ని తనదైన దృక్పథంతో విమర్శనాత్మకంగా విశ్లేషించి, కళాత్మకంగా ప్రతిఫలించడం అభ్యుదయ రచయిత కర్తవ్యం. పెద్దిభొట్ల ఈ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించారు. ఆయన అభ్యుదయ చింతనతో తనకు తెలిసిన మధ్యతరగతి జీవితంతోపాటు, బాధ్యతాయుతంగా తాను పరిశీలించిన క్రింది తరగతి జీవితాలను కూడా కథలుగా మలిచారు. ఆయన కథలు గుంటూరు, విజయవాడల మధ్య జరుగుతుంటాయి. స్వాతంత్య్రానంతర భారతదేశ ఆర్థిక రాజకీయ పరిస్ధితులు ఆయన కథల్లో ప్రతిబింబిస్తాయి. భూస్వామ్య, పెట్టుబడిదారీ విలువల మధ్య చిక్కుకున్న మధ్యతరగతి ఆయన కథలలో వాస్తవికంగా దర్శనమిస్తుంది. మానవ సంబంధాలను నియంత్రించే ఆర్థికాంశం ఆయన కథలలో స్వస్వరూపంతో కనిపిస్తుంది.

పెద్దిభొట్ల కథల్లో కొంత ఆదర్శవాదమున్నా, అది వాస్తవికతకు పోషకంగానే ఉంటుంది. జీవితంపట్ల ప్రేమ, సాహిత్యం పట్ల మక్కువ, పాఠకుని పట్ల మక్కువ, రచనలపట్ల నిబద్ధత, కథనం పట్ల నిగ్రహం, శిల్పంపట్ల విధేయత పెద్దిభొట్ల విధానం. పాఠకునిలో సామాజికాంశాల పట్ల అవగాహన కల్పించి సామాజిక పరివర్తనకు దోహదం చేసే ఆరోగ్యకర కథాసాహిత్య మార్గం పెద్దిభొట్ల సుబ్బరామయ్య.

Write a review

Note: HTML is not translated!
Bad           Good