పాఠకులు నాకు ఉత్తరాలు రాయడం, నేను ''పల్లటూరు'' కథ రాసినప్పటి నించీ ప్రారంభమైంది. అప్పుడు నాకు 18వ సంవత్సరం వుండొచ్చు. అంతకు ముందు కూడా 2, 3 చిన్న కథలు రాశాను. కానీ, ''పల్లెటూరు'' కొంచెం పెద్దది. ''ప్రేమ లేకుండా పెళ్ళి వుండకూడదు'' అని చెప్పిన కథ అది. పాఠకులకు అది చాలా నచ్చింది.


నాకు మార్క్సిజంతో పరిచయం అయ్యాక 'విషవృక్షమే' మొదటి రచన. 'కాపిటల్‌ పరిచయాలు' 5 భాగాలు అయ్యే వరకూ అదే పని సాగింది. పాఠకుల ఉత్తరాలు వస్తూనే వున్నాయి, నా జవాబులు వెళ్తూనే వున్నాయి.


అసలు నేను, పాఠకుల గురించి ఏ మనుకుంటానంటే, పుస్తకాలు తరుచుగా పునర్ముద్రణలు అవుతున్నాయంటే, పాఠకులు వాటిని కొంటున్నారని అర్థమే. కొంటున్నారు సరే, చదువుతున్నారా? నాలుగు పేజీలు ఇటూ అటూ తిప్పి పడేస్తున్నారా? చదివితే అర్ధమవుతున్నాయా? అర్ధమైతే, సంతోషిస్తున్నారా? ఒక పుస్తకం చదవక ముందు కన్నా, చదివిన తర్వాత వాళ్ళకి తమలో గాని, బైట గాని, ఏమైనా మార్పు కనపడుతోందా? చదివినప్పుడు తాత్కాలికంగా కలిగే సంతోషమేనా భావాల్లో నిజంగా స్థిరపడే మార్పులు జరుగుతున్నాయా - ఇటువంటి ప్రశ్నలే వుంటాయి నాకు.


పాఠకులకు నా పుస్తకాలు అర్ధమవుతున్నాయా? చదివే విషయాలతో ఏకీభవిస్తున్నారా? నా రాతల వల్ల ఏదైనా ఉపయోగం వుందా? వాటి వల్ల వారి ఆలోచనల్లో మార్పు జరిగిందా? - అనే సందేహాలకు జవాబులు ఉన్నాయి ఈ ఉత్తరాల్లో! - రంగనాయకమ్మ

Write a review

Note: HTML is not translated!
Bad           Good