పతంజలి రచించిన నవలలన్నీ కలిపి ముద్రించిన పుస్తకం 'పతంజలి సాహిత్యం మొదటి సంపుటం'. ఈ గ్రంథంలో వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు నవలికలు కాలక్రమం ప్రకారం వేరువేరు చోట్ల రావాల్సి ఉన్నప్పటికీ, ఆ మూడు ఒకదాని కొకటి కొనసాగింపుగా, ఒక అంతస్సూత్రంతో రాసినందున, వాటిని వరసగా చదువుకోడానికి వీలుగు ఒకేచోట చేర్చారు. నిజానికి 'ఒక దెయ్యం ఆత్మకథ' పంచతంత్రం శైలిలో మాయావాస్తవికతతో ఓ చిత్రమైన ప్రక్రియగా సాగిన రచన, కాని రచయితే దాన్ని నవలగా ప్రకటించుకున్నందున దాన్నీ, వీరబొబ్బిలికి ఆయనే స్వయంగా ఇంగ్లీషులోకి చేసి 'డాగ్గిష్ డాబ్లర్' అనువాదాన్నీ కూడా మొదటి సంపుటంలో చేర్చారు. ఇంతవరకూ పుస్తకరూపం దాల్చని 'రాజుల లోగిళ్ళు' నవల కూడా ఈ విభాగంలో ఉంది. ధారావాహికగా వచ్చి అర్ధాంతరంగా ఆగిపోయిన ఆ నవల కొసరు రాతప్రతి దొరికితే అది కూడా చేర్చాం. అయినప్పటికీ అది అసంపూర్తి నవలే. - ప్రసాద్ వర్మ, సురేష్
'పతంజలి సాహిత్యం రెండవ సంపుటం'లో కథలు, పతంజలి భాష్యం, సంపాదకీయాలు, అవీఇవీ, గెలుపుసరే బతకడం ఎలా? అనే ఐదు భాగాలు ఉన్నాయి.
ఈ సంపుటంలో కేవలం అనువాదాలుగా కాకుండా ఎప్పుడో చదివిన జ్ఞాపకం ఆధారంగా అనుసృజనగా రాసిన జ్ఞాపక కథలు, శెబాసో మపాసాలు కథల విభాగంలో చేర్చారు. 'ఉదయం' పత్రికలో మొదలు పెట్టినా, తరవాత పనిచేసిన దాదాపు అన్ని పత్రికల్లోనూ అదే శీర్షిక క్రింద రాస్తూ వచ్చినవన్నీ 'పతంజలి భాష్యం'లో చేర్చారు. కవితలు, వ్యాసాలు, సమీక్షలతో పాటు జర్నలిస్టు డైరీ, ఎడిటర్స్ నోట్బుక్, పలుకుబడి శీర్షికల క్రింద రాసినవి, వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలు ఈ రెండు సంపుటంలో ఉన్నాయి. ఖాకీవనం సమయంలో వివిన మూర్తికి పతంజలి స్వయంగా ఇంగ్లీషులో రాసిన ఉత్తరాన్ని, ఆయన దస్తూరీ రికార్డు చేసే ఉద్దేశంతో యథాతథంగా ఫోటో రూపంలో పదిలపరిచారు.
చెప్పేదేదో సూటిగా, స్పష్టంగా, నిర్మొహమాటంగా రాసేయడం తప్ప వివాదాల్లో తలదూర్చే ప్రకృతి లేని పతంజలి రెండు సందర్భాల్లో మాత్రం, రామకృష్ణారెడ్డికి, రంగనాయకమ్మకు ఎదురుతిరిగి జవాబులు రాశారు. ఇది కేవలం పతంజలి రచనల సంకలనం మాత్రమే అయినప్పటికీ, వారసలు ఏం రాశారో తెలియకపోతే, పతంజలి ఎందుకు అలా సమాధానం ఇచ్చారో తెలిసే అవకాశం లేదుకాబట్టి వ్యాసప్రతివ్యాసాల్ని ఒకే చోట 'వివాదం' అనే విభాగం క్రింద చేర్చారు.