చిన్నా, పెద్దా అందర్నీ తైతక్కలాడించే తలతిక్క శిష్యుల అద్భుత హాస్య కథా స్రవంతి 'పరమానందయ్య శిష్యుల కథలు'.
అమరావతిలో అద్భుత కథారంభం
ఆనాడు మహాశివరాత్రి. 'అమరేశ్వరుడు' వెలసిన అమరావతి దివ్యక్షేత్రం 'ఓం...'కార శంఖానాదాలు.. ఘణ ఘణ ఘంటారావాలు.. ఢహఢమ ఢమరుక ధ్వనులతో ప్రతిధ్వనిస్తోంది. 'అమరేశ్వర స్వామివారి ఆలయంలో 'అమరేశ్వర' లింగానికి సహస్ర ఘఠాభిషేకం జరుగుతోంది.
ఓం నమ: శంభవే చ మయోభవే చ నమ: శంకరాయ చ
మస్కరాయ చ నమ: శివాయ చ శివతరాయ చ || ఓం ||
'శివా.. ప్రాపంచిక ఆనందమూ, మోక్ష ఆనందము అయినవాడివి నీవే... ఆ ప్రాపంచిక ఆనందాన్ని, మోక్షానందాన్ని ప్రసాదించే వాడివి నీవే.. నీ సాన్నిధ్యాన్ని పొందినవారిని నీవలె శివమయం గావించే మంగళస్వరూపుడివి నీవే.. నీ సంకల్పమాత్రం చేతనే సృష్టించబడిన సమస్త ప్రపంచానికి శుభం అనుగ్రహించే శుభంకరా...శంకరా.. అమరేశ్వరా.. నీకివే నమస్సుమాంజలులు...ఓం నమ: శివాయ..నమో పమ:..' అంటూ చేతులు ఎత్తి ఆ సర్వేశ్వరుడికి నమస్కరించాడు పరమానందయ్య. ఆయన అమరావతి రాజ్య ఆస్థాన పండితుడు. మహారాజు నరేంద్రుడికి సమస్త వేద, ధర్మశాస్త్రాలు బోధించిన గురుదేవుడు. ఆ పండిత ప్రకాండుడు భక్తితో చేతులు జోడించి...''శంకరా... నా ప్రియశిష్యుడు, నీ ప్రగాఢ భక్తుడు రాజా నరేంద్రుడు నిన్ను దర్శించి నేటికి సరిగ్గా ఏడాది అయింది. ప్రతినిత్యం నిన్ను అర్చించనిదే పచ్చి గంగ అయినా స్వీకరించని అతడు నేడు రాత్రి పగలు అన్న భేదం లేకుండా నిరంతరం మధుపాన ప్రియుడయ్యాడు. నీ సేవతో పరవశించే ఆ ప్రభువు నేడు వేశ్యామందిరంలో కాలం గడుపుతునాన్డఉ. తండ్రీ...పరమేశ్వరా..పరమ దయాకరా..నీ ప్రియభక్తుడిని పెడదారి నుంచి మళ్లించలేవా..? సలక్షణమైన కన్యతో వివాహం జరిపించి సన్మార్గంలో పెట్టలేవా..? తండ్రీ ... నీకు అసాధ్యం అన్నది లేదే.. నీ సంకల్పం లేనిదే చీమ అయినా కదలదంటారే...నువ్వు తల్చుకుంటే ఎంత..?'' అని అర్థించాడు. మరుక్షణం... చిన్న గాలితెమ్మర నెమ్మదిగా వీచి... ఆయన చెవిలో గాలి గుసగుసలాడినట్లు. ''అందుకే గదా... గండు చీమల వంటి గడుగ్గాయిల్ని శిష్యులుగా నీ వద్దకి పంపుతున్నాను. 'పరమానందయ్య శిష్యులు' అంటూ నీకు.. సంకల్పించి నీ దగ్గరికి పంపిన నాకూ పేరు తెస్తార్లే...'' అన్నట్లు... అనిపించింది. ఆ అనుభూతికి ఒక్కసారిగా ఒళ్లు జలదరించినట్లయి నిశ్చేష్ఠుడయ్యాడు పరమానందయ్య...నిజమా..? శివుడు సంకల్పించాడా? గండుచీమల్లాంటి గడుగ్గాయిల్ని శిష్యులుగా తన వద్దకి పంపుతున్నాడా? ఎవరు వాళ్లు.. వచ్చి ఏం చేస్తారు..?