బాలబాలికల పాలిట జ్ఞాన ప్రసాదమైన యీ పంచతంత్రం బాల సాహిత్య నందనవనంలో పారిజాత సుగంధమై భారత ఉపఖండాన్ని దాటి ఆఫ్రికా, ఆసియా, యూరప్‌ ఖండాల్లోకి పాకి విశ్వమంతా వ్యాపించి ప్రపంచంలోని 60కి పైగా భాషలలోకి 200 అనువాదాలు వెలువడి అనన్య ప్రసిద్ధి చెందింది.

ఈ పంచతంత్రానికి కొన్ని కథలు చేర్చి 14వ శతాబ్దంలో నారాయణ కవి హితోపదేశమును గ్రంథాన్ని రచించాడు. దీన్ని తెలుగున గద్యపద్యాత్మకంగా అనువదించినవారూ - దూబగుంట నారాయణ, బైచరాజు వెంకటనాథులు. తొలుత వచనమున తెలుగుసేత చేసినవాడు - చిన్నయసూరి. ఈయన 19వ శతాబ్దంలో జీవించాడు. వీరి నీతి చంద్రికలో మిత్రలాభము, మిత్రభేదములను మాత్రమే చేర్చగా, విగ్రహము, సంధి అనే తంత్రములను యుగపురుషుడు శ్రీ కందుకూరి వీరేశలింగంగారు అనువదించారు. యీ నాలుగు తంత్రములకూ మాతృక ప్రధానంగా నారాయణకవి హితోపదేశమే. యీ హితోపదేశమునకు మాతృక విష్ణుశర్మ పంచతంత్రమే.

అయితే ఇటీవల శ్రీ వేములపల్లి ఉమామహేశ్వర పండితులు అయిదవ తంత్రము ''అపరీక్షిత కారిత్వము''ను కూడా వెలుగులోకి తెచ్చారు. మొదటి నాలుగు తంత్రములలో మృగపక్ష్యాదులే కథా నాయకులు. యీ పాత్రల ద్వారా రచయిత కేవలం నీతులనేగాక రాజనీతి జ్ఞానమును కూడా వెల్లడించాడు.

విగ్రహము, సంధి తంత్రముల ద్వారా అణు మారణ యుద్దోన్మాదం పెచ్చరిల్లుతున్న నేటి ప్రపంచంలో శాంతియుత సహజీవన సూత్రమును కొన్ని శతాబ్దముల క్రితమే బోధించిన యీ గ్రంథం ఎంత ఉత్కృష్టమైందో వేరే చెప్పనక్కరలేదు.

కాని మొదటి నాలుగు తంత్రములకు భిన్నమైనది - అయిదవ తంత్రము. ఇందులో మనుష్యులే మాట్లాడతారు. ఆలోచన లేకుండా పనులు చేసి అనర్థాలను తెచ్చి పెట్టుకునేది మనుషులని నిరూపించుటయే కవి ఉద్దేశంగా కనబడుతున్నది. శాస్త్రజ్ఞానముండీ బుద్ధిలేని వారిని అత్యంత ప్రతిభతో విష్ణుశర్మ చిత్రించినాడు. యీ అయిదవ తంత్రానికి నేను ''అనాలోచిత కార్యాలు'' అని పేరు పెట్టాను.

ఈ పంచతంత్రములో గుప్తమైయున్న నీతిని బాలబాలికలకు ఆసక్తిని కలిగించేవిధంగా వారికి సుబోధకమగు రీతిలో అందించాలన్న తాపత్రయమే నన్నీ కూర్పుకు పురిగొల్పింది. దీన్ని పఠించే బాలబాలికలు నీతిమార్గంలో పయనించి, గొప్ప లౌకిక జ్ఞాన సంపన్నులగుదురనుటకు సందేహం లేదు.

నేను చిన్నయసూరిగారి నీతిచంద్రికలోని మిత్రలాభము, మిత్రభేదములను; శ్రీ వీరేశలింగం పంతులుగారి విగ్రహము, సంధి తంత్రములను; ఉమామహేశ్వర పండితుల ''అపరీక్షితకారిత్వ'' తంత్రమును అనుసరించి, వాటిలో బాలబాలికలకు ఉపయుక్తమనుకున్న కొన్ని కథలను మాత్రమే సరళమైన భాషలో అందించుటకు ప్రయత్నం చేశాను.

- పడాల రామారావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good