ఈ పుస్తకంలోని కథలు దాదాపు అన్నీ ముప్ఫయ్యేళ్ళ క్రితం రాసినవి. మరికొన్ని ఇంకా ముందు రాసినవి. అంచేత ఇవ్వాళ ఈ పుస్తకం చదివిన పాఠకుడికి ఇవన్నీ పాతకథలుగా, పాతకాలం నాటి కథలుగా అనిపించవచ్చు. అలా అనుకోవటంలో పాఠకుడి తప్పేవిూలేదు. అంతమాత్రాన ఇవన్నీ అంత తేలిగ్గా కొట్టి పారేయ్యాల్సిన కథలు కావు. పైపైన చదివేసి, గబగబా పేజీలు తిప్పేసి, పక్కన పడవెయ్యాల్సిన పుస్తకం కాదిది. ఎందుకంటే ఈ కథల స్వరూపమూ, కథా సంవిధానమూ, కథనశైలీ పాత ధోరణిలో వున్నట్టనిపించినా ఈ కథల ద్వారా రచయిత చెప్పదల్చుచున్న విషయమూ, చిత్రించదల్చుకున్న సమస్యలూ ఇంకా పాతబడలేదు. ఇన్నేళ్ళు గడిచినా ఇన్ని థాబ్దాలు గడచినా ఆ సమస్యలు సమసిపోలేదు.
జీవితమంతా సమస్యలే, సందేహాలే అయిన వాళ్ళు ఈ దేశంలో ఇప్పటికీ నూటికి డెబ్భయిమందికి పైగా వున్నారు. సామాన్యులకే సమస్యలొస్తాయి. వాళ్ళకే సందేహాలుంటాయి. ఎన్నేళ్ళు గడిచినా ఎన్ని రాజ్యాలు మారినా, దేశమూ ప్రపంచమూ ఎంత 'అభివృద్ధి' సాధించినా వాళ్ళ సమస్యలకి పరిష్కారం దొరకదు, వాళ్ళ సందేహాలకి సమాధానమూ దొరకదు. ఈ కథల్లో అధికభాగం అదిగో అటువంటి సామాన్యుల గురించే శివకుమార్ రాశాడు.
కంటికి కనబడే ప్రతిదృశ్యమూ వాస్తవం కానక్కర్లేదనీ, ప్రత్యక్షంగా కనబడే ప్రవర్తనని బట్టి మనుషుల నిజరూపాలు గుర్తించటం అంత తేలికైన విషయం కాదనీ, ఈ సమాజంలో నీతులూ నియమాలూ నిజాలూ కూడా మనుషుల అవసరాన్ని బట్టీ, అవకాశాలను బట్టీ మారుతుంటాయనీ తన కథల ద్వారా చెప్పడానికి శివకుమార్ ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో నిజాయితీ వుంది. నిబద్ధత ఉంది.
వస్తుపరంగానే కాకుండా రూపాన్ని బట్టి కూడా వీలయినంత వైవిధ్యం కనబర్చడానికి రచయిత చేసిన ప్రయత్నం ఈ కథల్లో కనబడుతుంది. ఈ ప్రయత్నం చాలామటుకు విజయవంతంగా సాగిందని నేను భావిస్తున్నాను.
- డి.వెంకట్రామయ్య

Write a review

Note: HTML is not translated!
Bad           Good