భారతీయసమాజంలో చిరకాలంగా సామాజికంగానూ, సాంస్కృతికంగానూ తనదైన విశిష్టమైన నేపథ్యాన్ని కలిగివున్న ప్రముఖమైన అంశాల్లో గిరిజన సంస్కృతి ఒకటి. ఋగ్వేదకాలం నాటినుండి ఐతరేయబ్రాహ్మణం, పురాణసాహిత్యం, ప్రాచీనకావ్యాలువంటి అర్వాచీన సంప్రదాయ సాహిత్యధోరణులు మొదలుకొని ఆధునికకాలంలోని పురాతత్వ, మానవవిజ్ఞాన, సామాజికశాస్త్రాలుదాకా తనదైన ప్రత్యేకతను కలిగిన సమాజం భారతీయ గిరిజనసమాజం. ఆదిమమూలాలు, అనాదిసంస్కృతి కలిగిన గిరిజనసమూహాలు దేశవ్యాప్తంగా కాశ్మీరునుండి కన్యాకుమారిదాకా, తూర్పుసముద్రం, మొదలు పశ్చిమదిశ పర్వతాలదాకా ఎన్నోరకములైన జీవనరీతులను, అస్తిత్వాన్ని నేటికిని కలిగివున్నాయి. ప్రస్తుతకాలంలో భారతీయగిరిజన సముదాయాలు ఈశాన్యభారతదేశంలోని రాష్ట్రాల్లో అత్యధికంగా స్థూలదృష్టికి అగుపడుతున్నప్పటికిని దేశంలో అన్ని ఇతర రాష్ట్రాల్లోనూ గిరిజనతెగలు అధికంగా నివసించే ప్రాంతాలు సైతం చాలా వున్నాయి.
'గిరిజన సంస్కృతి సాహిత్యం' రచన భారతీయగిరిజనవ్యవస్థకు సంబంధించిన విశేషాంశాలను కొన్నింటిని వీలయినంత ఆసక్తికరంగా పాఠకులకు అందించాలన్న వుద్దేశ్యంతో రూపొందించబడింది. భారతదేశంలో దేశవ్యాప్తంగా వున్నట్టి గిరిజన తెగల ఆచారవ్యవహారాలు వీలైనంత స్థూలంగానూ, వారి సంస్కృతికి సంబంధించిన ఎన్నోఅంశాలు కొద్దిపాటి పరిచయమాత్రంగానూ ఇందులో వివరించబడినాయి. భారతీయగిరిజన తెగలకు సంబంధించిన మానవజాతుల మూలాలు, భాషారూపాలు, జాతీయతా అంశాలు, జీవనరీతులు, కళాత్మకత, దేవతావిశ్వాసాలు, పురాణనేపథ్యం, సాహిత్యప్రశంస వంటివాటికి చెందిన అంశాలు ఇందులో స్థాలిపులాక న్యాయంగా పొందుపరచబడినాయి. గ్రంథవిస్తారభీతిచేత పాశ్చాత్య ప్రపంచంలోని గిరిజనజాతుల ప్రశంస ఇందులో వ్యక్తంగావించబడలేదు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన గిరిజనతెగల ప్రశంస, పురాణసాహిత్యంలోనూ, తెలుగు సాహిత్యంలోనూ, గిరిజనప్రస్తావనను గురించి వీలైనంత ఆసక్తికరమైన అంశాలు సైతం ఈరచనలో కొంతదాకా అగుపడుతాయి.