తెలుగు కథ మధ్యతరగతిని అలరించే సాధనంగా ఎప్పుడో మారిపోయింది. కాని, అస్తిత్వ ఉద్యమాలు అందించిన కథలకు ఒక స్పష్టమైన ప్రయోజనం దాగి ఉంది. అది ఆయా సమూహాలను ఎడ్యుకేట్ చేయడం. రెండవది ఆ ఉద్యమాలకు బయటి నుండి మద్ధతు కూడగట్టడం. ఈ నేపథ్యంలో డా.పసునూరి రవీందర్ రచించిన కథలు తెలంగాణ దళిత జీవితాలకు సంబంధించినవి. ఈ కథల్లో దళితులు తమ నిత్యజీవితంలో కులం కారణంగా ఎదుర్కొంటున్న అవమానాలను కథలుగా మలిచారు. కులం పోయిందని చెప్తూనే కులపట్టింపులతో బతికే వాళ్లకు ఈ కథలు చెంపపెట్టు వంటివి. సమస్త రంగాలను ఆక్రమించిన కుల ఉనికిని నడిరోడ్డు మీదికి ఈడ్చి, ఇంకా మారని ఛాందసపోకడలను నిలదీస్తాయి ఈ కథలు. ఈ కథలు చదివినపుడు కొంత ఆశ్చర్యం, విస్మయం కలిగినా అది అనుభవంలో నుండి రాసిందనే విషయం తెలిసినపుడు పాఠకుని కన్నులు మరోసారి తెరుచుకుంటాయి. ఈ సమాజానికి పట్టిన కులజాఢ్యపు జబ్బును పదిహేను కథల్లో కథకుడు పలువిధాలుగా చిత్రించాడు. మన చుట్టూ కుల నిచ్చెనమెట్లు నిర్మితమై ఉన్న తీరును కళ్లముందుంచాడు. ఈ కథలు ఇప్పటికే ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ దినపత్రికలతో పాటు పలు సాహిత్య సంచికల్లో అచ్చయ్యాయి. పలు భాషల్లోకి అనువాదమయ్యాయి. పలు యూనివర్సిటీల్లో ఈ కథలపై పరిశోధనలు జరుగుతున్నాయి. అలరించేలా కాకుండా ఆలోచింపజేసే కథలివి. ఇవాళ్టి సోకాల్డ్ ప్రపంచపు ద్వందనీతిని అద్దంలో చూపే రాజకీయ కథలివి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good