ఈ సంపుటిలో 'రాత్రి'ని గురించి రాసిన కవితలు చాలా ఉన్నాయి. రాత్రిని అనుభవించడంలో స్త్రీ దృష్టిని ఇవి వ్యక్తపరుస్తాయి. పురుష దృష్టితో స్త్రీని ఆనందించడం కాక స్త్రీని అర్థం చేసుకొని తనను సగం తగ్గించుకోవడం అనే పాఠాన్ని ఈ కవితల వల్ల మనం నేర్చుకోవచ్చు. స్త్రీకి  కనిపించే ఆ రాత్రులెట్లాంటివో ముందు చూద్దాం. ఒకటి పాటతో పరవశించిన రాత్రి, ఇక్కడ కూడా జెండర్‌ స్పృహ ఉండొచ్చు. అంటే పరవశించిన పద్ధతిలో అన్నమాట. 'ప్రేమ రాహిత్యపు రాత్రి' పేరులోనే ఆ విషయం స్పష్టంగా వుంది.
''చివరికివాళ పరిగెలో ప్రేమ కోసం వెతికే
నీ వెర్రితనాన్ని చూస్తే నవ్వొస్తుంది''.
కోసిన చేనులో రాలిన వెన్నులను పరిగెలంటారు. సందర్భం వేరే అయినా ''పంట చేను విడిచి పరిగెలేరినట్లు'' అన్నాడు వేమన. పరిగెలో ప్రేమ కోసం వెతకడం వృధా అంటుంది ఓల్గా. ఒకరితో ఒకరు కలిసి జీవించిన జీవితం ఒక గెలుపుగా కాక ఓటమిగా మారినప్పుడు ఆ విషయాన్ని విప్పి చెప్పే 'రాత్రులకు వందనం' అంటుంది కవయిత్రి. 'రాజకీయ రాత్రులు' అనేది గొప్ప కవిత. సత్యాన్ని అటూ ఇటూ చెయ్యడానికి ప్రయత్నించే రాజకీయాలుంటాయి, వినండి దానిని గుర్తించిన స్త్రీ సంవేదన.
'రాత్రులకు రాత్రులు కుటిలమవుతూ
ఒక్కరూ లేరా
నాకు తప్ప సత్యం ఎవరికీ ఎందుకు బోధపడదు?
నా రాత్రులను వేధించి వెంటాడే ప్రశ్న
రాజకీయాలలో ప్రతిరాత్రీ హారాకిరీ తప్పదు''..

Write a review

Note: HTML is not translated!
Bad           Good