ఈ భూమి మీద 1,53,24,000 ట్రాన్స్ జెండర్ వాళ్ళున్నారని అంచనా. అంటే కజఖిస్థాన్, ఈక్వెడార్, కాంబోడియా దేశాల జనాభా అంత. ఈ సంఖ్యను చూస్తే మనలో ఒక కొత్త ఆలోచన నాంది కలుగుతుంది.
ఈ పుస్తకానికి పాఠకులను పట్టి చదివించే శక్తి, వాళ్ళ ఆలోచనను ప్రేరేపించే శక్తి వున్నది. అట్లాగే విస్మయ భీతిని కూడా కలిగిస్తుంది. పుస్తకం అంతటా రేవతి తాను ఎదుర్కొన్న భయానక సంఘటన గురించి చెబుతుంది. కానీ ఎవరి సానుభూతిని కోరదు. ఆమె అడిగేదొక్కటే. హిజ్రాలను అందరి మానవుల వలె కోరికలూ ఆశలూ వున్న తోటి మనుషులుగా చూడమని. ఒక హిజ్రాగా తన వ్యక్తిగత విషయాలను నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పిన తీరు అభినందనీయమేకాక హృదయానికి హత్తుకునే విధంగా కూడా వుంది. తన లింగ మార్పిడి శస్త్ర చికిత్స గురించైనా, పోలీసులు పెట్టిన హింస గురించైనా, తన క్లయింట్స్ గురించైనా! జెండర్ గురించీ, పురుషాధిక్యత గురించీ ఆమె చేసిన విమర్శలు, వ్యాఖ్యలు చాలా స్పష్టంగా శక్తివంతంగా వుండి స్త్రీ పురుషులతో పాటు మూడవ లింగాన్ని కూడా మనం మానవీయంగా అర్థం చేసుకునే విధంగా కృషి చేయ్యాలనే అవగాహనను కలిగిస్తుంది.
- యోగిందర్ సికండ్