ఆ అమ్మాయి జీవించి ఉన్నది ఇరవై సంవత్సరాలైనా లేదు. ఆ అమ్మాయి విశ్వవిద్యాలయాలలో చదివిన విద్యావతి కాదు. అందగత్తె కూడా కాదు. కలవారి ఇంటి అమ్మాయికాదు. పోనీ పుట్టింది గొపప వంశమా అంటే అదీకాదు. కానీ ఆమె సరదాకు రాసుకున్న డైరీ ప్రపంచ సాహిత్యంలో మొదటి వంద పుస్తకాలలో ఒకటని విజ్ఞుల తీర్పు. ఆమె మేధకన్న హృదయం ఆ రచనలో నిండుగా ప్రతిఫలించడమే. యుద్ధం సామాన్యులు కోరుకోరు. యుద్ధం హృదయంలేని మేధావులు, రాజకీయ వేత్తల వల్ల సంభవిస్తుంది. వాళ్ళు తాము అధికారంలో కొనసాగడానికీ, ప్రజల దృష్టిని అసలైన సమస్యలనుండి దృష్టి మళ్ళించడానికీ యుద్ధాలను చెలరేపుతారు. యుద్ధాలలో రాజకీయ నాయకులు బాగానే ఉంటారు. ఇబ్బందులు పడేదీ, చనిపోయేదీ సైనికులూ, అమాయకులైన సామాన్యులు. యుద్ధం అది ఏయుద్ధమైనా ఎంత పాశవికమైనదో, మరెంత అమానుషమైనదో, దానివల్ల కుటుంబాలు ఎలా కకావికలై, మానవహృదయాలలో ఎంత తీవ్రమైన తుఫానులు చెలరేగి సంక్షుభితమవుతాయో ఆ అమ్మాయి పుస్తకం తెలియచేస్తుంది. అమాయకులైన ప్రజలలో జాతి ద్వేషాన్ని రెచ్చగొట్టి దానికి వేలు లక్షలమందిని బలి చేసే నరహంతక కిరాతక నియంతలు ఉన్నంతవరకూ ఆ అమ్మాయి పుస్తకం నిలిచే ఉంటుంది.
Pages : 260