విశాల విశ్వంలోని వస్తు పదార్థమంతా రసాయనాలతో తయారయింది. ఆ రసాయనాలను ఒక పద్ధతిలో పట్టి పనిచేయించే విధానాలు, భౌతికశాస్త్రంలోకి వస్తాయి. ప్రతిప్రాణికి, ప్రతి మనిషికి అనునిత్యం అనుభవంలోకి వచ్చే ఈ భౌతికశాస్త్రం ఎంతో విచిత్రమయినది. మనం ఎలా నడుస్తాము, ఎలా కదులుతాము అని ఎప్పుడయినా ప్రశ్నించుకున్నామా? కానీ, భౌతిక శాస్త్రపరంగా ఈ నడక వెనుక గల పద్ధతిని, విశేషాలను చెప్పినప్పుడు విన్నవారికి, చదివిన వారికి ఆశ్చర్యం తప్పదు.
సూది ఎందుకు గుచ్చుకుంటుంది? గాలిలో చలి ఎందుకు ఎక్కువనిపిస్తుంది? మంట పైకే ఎందుకు మండుతుంది? విసనకర్ర మనకు ఎలా సహాయం చేస్తుంది? ఇవన్నీ మనం, ఎప్పటికప్పుడు 'ఎవరినయినా అడిగి తెలుసుకుంటే బాగుండును!' అనిపించే ప్రశ్నలు అయితే, వీటికి ఓపికగా, మనకు అర్థం అయే పద్ధతిలో జవాబు చెప్పేవారు ఎక్కడున్నారో తెలియక, ప్రశ్నను ప్రశ్నగానే వదిలేస్తాం. యాకోవ్ పెరెల్మాన్ ఇటువంటి సమాచారాన్నంతా సమీకరించి రూపొందించిన చక్కని పుస్తకమే 'నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం'.